నమస్తే తెలంగాణ నెట్వర్క్ : మహారాష్ట్రలో కరుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో చేపలు పట్టేందుకు మత్స్యకారులెవరూ వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారి(ఎన్‌హెచ్-163)పై ఉన్న వాజేడు మండలం టేకులగూడెం వంతెన మూసివేస్తున్నట్టు ములుగు ఎస్పీ శబరీశ్ తెలిపారు. నాగార్జునసాగర్‌కు శ్రీశైలం క్రస్ట్, జలవిద్యుత్తు కేంద్రాల ద్వారా వరద కొనసాగుతున్నది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు గేటు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంవడ్డాడి మత్తడివాగు ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఆసిఫాబాద్జిల్లాలోని కుమ్రం భీం ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. దహెగాం మండ లం మొట్లగూడ, రాంపూర్, దిగడలో పంటలు నీట మునిగిపోగా ఎంపీడీవో ఆల్బర్ట్ పరిశీలించారు.
కుమ్రంభీం (అడ) ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి 4.3 టీఎంసీల నీటిని దిగువకు వదులుతున్నారు. కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. జూరాలకు ఇన్‌ఫ్లో 1,09,000 క్యూసెక్కులు ఉండ గా, 10 గేట్లు ఎత్తి 67,250 క్యూసెక్కులు విడుదల చేశారు. తుంగభద్ర డ్యాం ఇన్‌ఫ్లో 43,091 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 34,351 క్యూసెక్కులు ఉన్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 45,982 క్యూసెక్కులు ఉండ గా, ప్రధాన కాల్వకు 595 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సుంకేసుల బరాజ్‌కు 45,3 87 క్యూసెక్కులు చేరుతున్నది. ఆర్డీఎస్ ఆనకట్టలో 10.9 అడుగుల నీటి నిల్వ ఉన్నది. శ్రీశై లం మూడు క్రస్ట్ గేట్లను ఎత్తి 81,333 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.