హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల కోడ్‌తో సుమారు మూడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం పునఃప్రారంభమైంది. ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై దరఖాస్తులు సమర్పించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడం, పాలనా పరమైన అడ్డంకులు తొలగడంతో ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిషరిస్తామని తెలిపారు. అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 373 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. రెవెన్యూ 120, విద్యాశాఖ 43, మున్సిపల్ శాఖ 43, హోం శాఖ 29, పౌరసరఫరాల శాఖ 18, ఇతర శాఖలకు సంబంధించి 120 దరఖాస్తులు అందినట్టు అధికారులు వివరించారు. ప్రజావాణి ప్రత్యేకాధికారి, మున్సిపల్ శాఖ సంచాలకులు దివ్య, ఇతర అధికారులు దరఖాస్తులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.