జగిత్యాల కలెక్టరేట్లో అమానుష ఘటన చోటుచేసుకున్నది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన దివ్యాంగుడు మర్రిపెల్లి రాజగంగారాం తన ఇంటికి వెళ్లే దారిలో నిర్మించిన ఓ గోడ విషయమై అధికారులు చర్య తీసుకోకపోవడంపై నిరసన తెలిపేందుకు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. కలెక్టర్ వెళ్లే దారిలో పడుకుని నిరసనకు ప్రయత్నించిన దివ్యాంగుడిని పోలీసులు బయటకు లాగి పారేశారు. దుస్తులు ఊడిపోతున్నా వినకుండా కుర్చీలోంచి కింద పడేశారు. అందరూ చూస్తుండగా గొరగొరా ఈడ్చుకెళ్లారు.
జగిత్యాల, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): జగిత్యాల కలెక్టరేట్లో అమానుష ఘటన చోటుచేసుకున్నది. సాక్షాత్తూ కలెక్టర్ ఎదుటే ఓ దివ్యాంగుడిని సిబ్బంది బయటకి లాగి పడేశారు. సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన ఓ దివ్యాంగుడు.. సోమవారం జరిగిన ‘ప్రజావాణి’లో కలెక్టర్ వెళ్లే దారిలో అడ్డు పడుకొని నిరసన తెలిపేందుకు ప్రయత్నించాడు. సిబ్బంది దివ్యాంగుడని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లినా, కలెక్టర్‌తోపాటు ఏ ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం చర్చనీయాంశంగా మా రింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన దివ్యాంగుడు మర్రిపెల్లి రాజగంగారాం తన ఇంటికి సంబంధించిన దారిలో గోడ నిర్మాణం విషయమై చాలాకాలంగా మండల, డివిజన్ స్థాయిలో ఎంపీడీవో, తహసీల్దార్, ఆర్డీవోలకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడంతో విసిగిపోయాడు.
సోమవారం జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి వచ్చాడు. ప్రజావాణి హాలులో నేలపై పడుకొని నిరసన తెలిపేందుకు యత్నించగా, కానిస్టేబుల్, సిబ్బంది గమనించి ఆయన్ను వీల్‌చైర్‌లో బయటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో కిందపడిపోయాడు. అనంతరం ఆయన ప్రజావాణి నిర్వహించే హాలు ద్వారం వద్ద అడ్డంగా పడుకొని నిరసన తెలిపాడు. అయితే కలెక్టర్ సత్యప్రసాద్ అదే ద్వారం నుంచి లోనికి వెళ్లిపోయారు. అక్కడే దివ్యాంగుడు నిరసన తెలుపుతున్నా కలెక్టర్ పట్టించుకోకుండా వెళ్లడం, సిబ్బంది అమానుషంగా ప్రవర్తించడంపై విమర్శలొస్తున్నాయి.
బాధితుడు రాజగంగారాం మాట్లాడుతూ.. గత వారం తాను మల్లాపూర్‌లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చి ఆరుబయట నిరసన తెలిపానని, తహసీల్దార్ స్పందించి వారం రోజు ల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వెళ్లిపోయినట్టు చెప్పాడు. తర్వాత తహసీల్దార్, ఎంపీడీవోను కలిసినా పట్టించుకోలేదని అన్నాడు. అందుకే ప్రజావాణికి వచ్చినట్టు తెలిపాడు. చాలాకాలంగా తన సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదన్నాడు.
ఈ విషయమై మండల, డివిజన్ స్థాయి అధికారులు మాట్లాడుతూ.. దివ్యాంగుడు రాజగంగారాం ఎప్పుడూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడని తెలిపారు. దారి విషయంలో రాజగంగారాంకు ఎలాంటి హక్కు లేదని, ఆయనకు దాయాదుల మధ్య సమస్య ఉన్నదని చెప్పారు.
ప్రజావాణికి వచ్చిన దివ్యాంగుడు రాజగంగారాం పట్ల సిబ్బంది వ్యవహరించిన తీరుపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్‌తో మాట్లాడారు. మంగళవారం ఉదయం 11 గంటలకు నేరుగా రాజగంగారాం ఇంటికి వెళ్లి సమస్యను పరిష్కరించాలని సూచించారు. 24 గంటల్లో సమస్యను పరిష్కరించి తనకు వ్యక్తిగతంగా తెలపాలని ఆదేశించారు.
రాజ గంగారాం పట్ల దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టు కలెక్టర్ బీ సత్యప్రసాద్ తెలిపారు. ఘటన తర్వాత తానే స్వయంగా రాజగంగారాం భార్యతో మాట్లాడినట్టు పేర్కొన్నారు.