హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ, టీపీసీసీ అధ్యక్షుడికి ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయిందా? అని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. కొండంత రాగం తీసి రేవంత్ పాట పడినట్టుగా ప్రజాకోర్టు ఉందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రజాకోర్టు ఓ అట్టర్ ఫ్లాప్షో అని అభివర్ణించారు. బాహుబలి సెట్టింగ్ వేసి, పులకేశి సినిమా చూపించిన రేవంత్, ‘తిరగబడదాం..తరిమికొడదాం’.. అనేది ప్రజాస్వామిక సిద్ధాంతమా? లేక తెలంగాణ నయా నయీమ్ రేవంత్ తీవ్రవాదమా? అని ప్రశ్నించారు. ‘రేవంతు.. కాంగ్రెస్ ఓట్ల పోరాటంలో ఉందా? లేక తూటాల పోరాటంలో ఉందా’..? అని నిలదీశారు. తెలంగాణ ప్రజలు ఓట్లు వేయ్యరని రేవంత్, కాంగ్రెస్ పార్టీ ముందే చేతులెత్తేసిందా? అని ఎద్దేవా చేశారు. ప్రజలు లేని ఖాళీ కుర్చీల ప్రజాకోర్టు ఆసాంతం కేసీఆర్పై అకసుతో కడుపు మంటలు, కకుర్తి అరుపులు, ఊపిరితిత్తులు పగిలేలా ఊకదంపుడు ఉపన్యాసాలు, నిరాధారమైన ఆరోపణలు అని శ్రవణ్ అన్నారు.