బంజారాహిల్స్, ఏప్రిల్ 30: పచ్చదనం పెంపుదలకు తీసుకొంటున్న చర్యలతో హైదరాబాద్ మరింత సుందర నగరంగా మారుతున్నదని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి అశ్వినీకుమార్ చుబే ప్రశంసించారు. హైదరాబాద్ నగరం వృక్షాల నగరం అని కితాబిచ్చారు. ఈ సుందర నగరంలో పచ్చదనం బాగున్నదని కొనియాడారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా శనివారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ జాతీయ పార్కులో కర్నల్ సంతోష్‌బాబు పేరిట ఏర్పాటుచేసిన స్మృతివనంలో ఆయన మొక్కలు నాటి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అశ్వినీకుమార్ మాట్లాడుతూ.. కేబీఆర్ పార్కులో మంచి అటవీ సంపద పెంచుతున్నారని, దీనిని కాపాడటంలో అటవీశాఖ అధికారుల కృషి అభినందనీయమని అన్నారు. తెలంగాణలో అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు చేపట్టిన చర్యలపై సీసీఎఫ్ ఎంజే అక్బర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బాగున్నదని మెచ్చుకొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా సుమారు 1,000కి పైగా పట్టణ వనాలు, తెలంగాణలో తొమ్మిది వనాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వాల కృషికి ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని పేర్కొన్నారు. బాల్యం నుంచే విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని, కేబీఆర్ పార్కులో అవసరమైతే నెలకోసారి విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు పీసీసీఎఫ్ ఏకే సిన్హా, పీసీసీఎఫ్ సర్గం శ్రీనివాస్, డీఎఫ్‌వో జోజి, రేంజ్ ఆఫీసర్ అనూరాధ తదితరులు పాల్గొన్నారు.