Delhi High Court | సంగీత దిగ్గజం ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నుంచి గట్టి షాక్ తగిలింది. ఇళయరాజాకు మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ‘సరిగమ ఇండియా లిమిటెడ్’ మధ్య జరుగుతున్న కాపీరైట్ వివాదంలో ఢిల్లీ హైకోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. 1976 నుండి వచ్చిన దాదాపు 134 సినిమాల్లోని వివాదాస్పద పాటలను ఇళయరాజా ఎక్కడా ప్రసారం చేయకుండా లేదా ఇతరులకు చేరవేయకుండా కోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ తుషార్ రావు గెడెలా.. ఇళయరాజా తాను సృష్టించిన స్వరాలపై మాత్రమే కాపీరైట్ హక్కులను కలిగి ఉంటారని, సినిమాల్లో ఉపయోగించిన పూర్తి సౌండ్ రికార్డింగ్స్‌పై ఆయనకు హక్కులు ఉండవని స్పష్టం చేశారు. కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 14(ఎ) ప్రకారం ఇళయరాజా హక్కులు కేవలం సాహిత్యం మినహాయించిన ట్యూన్స్ వరకే పరిమితమని, ఆ సౌండ్ రికార్డింగులను ఆయన సొంతంగా వాడుకుంటే అది కాపీరైట్ ఉల్లంఘనే అవుతుందని న్యాయస్థానం ప్రాథమికంగా నిర్ధారించింది.
అసలు వివాదం ఏమిటంటే..
1976 నుంచి 2001 మధ్య కాలంలో విడుదలైన పలు చిత్రాల నిర్మాతలతో తాము అధికారికంగా ఒప్పందాలు చేసుకున్నామని సరిగమ పేర్కొంది. ఈ ఒప్పందాల ప్రకారం ఆయా సినిమాల్లోని పాటల పూర్తి సౌండ్ రికార్డింగ్స్, సంగీతం మరియు సాహిత్య పరమైన కాపీరైట్ హక్కులు చట్టబద్ధంగా తమకే సొంతమని ఆ సంస్థ వాదిస్తోంది. అయితే సరిగమ సంస్థకు హక్కులున్న ఈ 134 సినిమాల పాటలను ఇళయరాజా తన సొంత ఆస్తులుగా పేర్కొంటూ అమెజాన్ మ్యూజిక్, ఐట్యూన్స్, జియో సావన్ వంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అప్లోడ్ చేశారు. ఆ పాటలపై వచ్చే యాజమాన్య హక్కులు తనవేనని ఆయన ప్రకటించారు.
దీంతో తమ అనుమతి లేకుండా, తమకు హక్కులున్న సౌండ్ రికార్డింగులను ఇళయరాజా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వాడుకోవడం మరియు వాటిపై హక్కులు క్లెయిమ్ చేయడం కాపీరైట్ ఉల్లంఘన (Copyright Infringement) కిందకు వస్తుందని సరిగమ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన కోర్టు.. ఇళయరాజాకు కేవలం ఆయన కంపోజ్ చేసిన ట్యూన్స్ పైనే హక్కులు ఉంటాయని, పూర్తి సౌండ్ రికార్డింగ్‌పై హక్కులు నిర్మాతలకు లేదా వాటిని కొనుగోలు చేసిన సరిగమ సంస్థకే ఉంటాయని స్పష్టం చేస్తూ ఇళయరాజా ఆ పాటలను ప్రసారం చేయకుండా నిషేధం విధించింది.