హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు నిజాలు వెల్లడించేందుకు అసెంబ్లీలో తమకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్‌ను కోరారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ఎల్పీ బృందం శుక్రవారం స్పీకర్‌ను కలుసుకుంది. బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానందగౌడ్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, పార్టీ ఎల్పీ కార్యాలయ కార్యదర్శి ఎం రమేశ్‌కుమార్‌రెడ్డి ఈ మేరకు స్పీకర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. లక్ష కోట్ల దోపిడీ అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. అం దు లో భాగంగానే కాళేశ్వరం కమిషన్ నివేదికను సోషల్ మీడియాలో లీక్ చేసిందని విమర్శించారు. కాళేశ్వరాన్ని వృథా ప్రాజెక్టుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ కృషిని, కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు అవకాశం కల్పించాలని స్పీకర్‌ను కోరినట్టు తెలిపారు.
రేవంత్‌వి బురద రాజకీయాలు
భారీ వర్షాలు, వరదలతో ఉత్తరతెలంగాణ ఆగమాగం అవుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి బురద రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానందగౌడ్ విమర్శించారు. అకాల వర్షాలు, వరదలతో పెద్ద ఎత్తున నష్టం జరిగితే ప్రజలను, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అసెంబ్లీలో ఎలాంటి చర్చకైనా బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నట్టు స్పష్టంచేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మైక్ కట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు మైక్ కట్ చేయకుండా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం బట్టలు విప్పేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నదని స్పష్టంచేశారు.