హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విద్యుత్తు సవరణల బిల్లు-2022ను పార్లమెంట్లో ప్రవేశపెడితే.. దేశవ్యాప్తంగా విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లతో కలిసి సమ్మెకు దిగుతామని ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ నేతలు హెచ్చరించారు. బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్(ఎన్సీసీవోఈఈఈ) ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో వివిధ రాష్ర్టాలకు చెందిన విద్యుత్తు కార్మికులు, ఉద్యోగులు, ఇంజినీర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) చైర్మన్ శైలేంద్ర దూబే మాట్లాడుతూ.. విద్యుత్తు సవరణల బిల్లు-2022పై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ ఇప్పటివరకూ దీనిపై చర్చించలేదని పేర్కొన్నారు.
విద్యుత్తు వినియోగదారులు, విద్యుత్తు సంస్థల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు ఈ బిల్లుకు వ్యతిరేకంగా గళం ఎత్తాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ బిల్లు పాసైతే భవిష్యత్తులో పేదలు, గ్రామీణ వినియోగదారులకు విద్యుత్తు అందుబాటులో ఉండదని, కరెంటు బిల్లులు మరింత భారంగా మారతాయని ఆందోళన వ్యక్తంచేశారు. డిస్కంలు విద్యుత్తును కొనలేని ఆర్థిక నష్టాల్లోకి వెళ్తాయని చెప్పారు. విద్యుత్తు చట్టం-2003కు ఏమైనా సవరణలు చేయాలనుకుంటే.. ముందుగా ఒడిశాలో ప్రవేశపెట్టిన ప్రైవేటీకరణ ఎందుకు విఫలమైందో అధ్యయనం చేయాలని సూచించారు.
దేశవ్యాప్తంగా సాధారణ ప్రజల విషయంలోనూ విఫల ప్రయోగం చేసేందుకు తాము అంగీకరించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈ కరీం, ప్రశాంత్ ఎన్ చౌదరి, మోహన్‌శర్మ, ఆర్కే త్రివేది, కుల్దీప్కుమార్, పీ రత్నాకర్‌రావు, పదంజిత్ సింగ్, కే అశోక్‌రావు, అభిమన్యు ధంకర్, సమర్సిన్హా, ఆర్కే శర్మ, కృష్ణ బోయుర్, సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా, ఎంపీలు ఎలమారం కరీం, ఆర్ కృష్ణయ్య, మాజీ ఎంపీ తపన్‌సేన్, సంయుక్త కిసాన్ మోర్చా నేత హన్నన్‌ముల్లా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత గౌరవ్ మహేశ్వరి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లు సమ్మెకు దిగితే అందుకు కేంద్రమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఏకగ్రీవ తీర్మానం చేశారు. విద్యుత్తు చట్ట సవరణల బిల్లును ఉపసంహరించుకోవడంతోపాటు పాత పెన్షన్ స్కీమ్‌ను అమలుచేయాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.