సూర్యాపేట, మే 20 (నమస్తే తెలంగాణ): నోట్ల రద్దుతో కేంద్రంలోని మోదీ పాలనకు తిరోగమనం మొదలైందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇది దేశాభివృద్ధికి ఎంత మాత్రం దోహదపడదని పేర్కొన్నారు. శనివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. ఆర్థికంగా దేశాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగానే మోదీ సర్కార్ రెండు వేల నోట్లను రద్దు చేసిందని మండిపడ్డారు.
పెట్టుబడి దారుల రహస్య ఎజెండాను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుందనడానికి ఇదొక చక్కటి ఉదాహరణగా చెప్పారు. అసలు రెండు వేల నోట్లను ఎందుకు తెచ్చారో? ఎందుకు రద్దు చేశారో? ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపయోగం లేదనుకున్నప్పుడు ఎందుకు తీసుకొచ్చారని? ఏం ఆశించి ఈ చర్యలకు ఉపక్రమించారని సర్వత్రా వెలువడుతున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మోదీ సర్కార్‌పై ఉన్నదని అన్నారు.
నోట్ల రద్దు వెనుక బీజేపీ రహస్య ఎజెండాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్బీఐని ముందు పెట్టి ప్రజల కళ్లు గప్పే ప్రయత్నం తప్ప మరొకటి కాదని ఆయన మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పతనావస్థకు చేరుకున్నదని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.