రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): కాటన్ చీరల తయారీ కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర ంలో సోమవారం పవర్లూమ్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. నిరవధిక సమ్మెతో కాటన్ పవర్లూమ్ పరిశ్రమ మూతపడింది.
ఈ సందర్భంగా సీఐటీయూ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ.. కాటన్ చీరలు తయారుచేసే కార్మికులు, ఆసాముల కూలి ఒప్పందం గడువు ముగిసి 30 నెలలు దాటినప్పటికీ యజమానులు కూలి పెంచడం లేదని, నోటీసులు ఇచ్చినప్పటికీ మొండివైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. కార్మికులకు చీరకు రూ.100, ఆసాములకు రూ.150, కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూలి పెంచేదాకా సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు.