హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ ): ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్తు డిమాండ్‌పై ఆ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తప్పాయి. మే 1 నుంచి విద్యుత్తు కోతలు ఉండబోవని, అదనపు విద్యుత్తు అందుబాటులోకి వస్తుందని విద్యుత్తుశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిన మాటలన్నీ ఒట్టివేనని తేలాయి. ఏపీలో అనూహ్యంగా పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌ను జగన్ సర్కార్ అంచనా వేయలేకపోయింది. దాంతో విద్యుత్తు కోతలు ఇప్పట్లో ఆగేలా లేవు. పరిశ్రమలకు పవర్ హాలిడేను మరో 15 రోజులు పొడిగించింది. పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో అప్రకటిత విద్యుత్తు కోతలతో జనం అల్లాడుతున్నారు.
రోజువారీగా విద్యుత్ వినియోగం
ప్రస్తుతం ఏపీలో సగటు విద్యుత్తు వినియోగం రోజుకు 220 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఇందులో థర్మల్ నుంచి 75 మిలియన్ యూనిట్లు, జెన్కో నుంచి 5 మిలియన్ యూనిట్లు, కేంద్ర విద్యుత్తు సంస్థల నుంచి 35 మిలియన్ యూనిట్లు, స్వతంత్ర విద్యుత్తు ఉత్పత్తిదారుల నుంచి 15 మిలియన్ యూనిట్లు, పవన విద్యుత్తు నుంచి 26 మిలియన్ యూనిట్లు, సౌర విద్యుత్తు నుంచి 23 మిలియన్ యూనిట్లు లభిస్తున్నది. సర్దుబాటు కోసం 34 మిలియన్ యూనిట్ల విద్యుత్తును పవర్ ఎక్స్చేంజ్ నుంచి డిస్కంలు కొంటున్నాయి.
పవన విద్యుత్తుపైనే ఆశలు !
ఏపీలో వడగాడ్పులు పెరుగుతున్నందున పవన విద్యుత్తు ఉత్పత్తిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకున్నది. ప్రస్తుతం దాదాపు 25 మిలియన్ యూనిట్ల పవన్ విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. రెండో వారం నుంచి గాలుల తీవ్రత పెరుగుతుందని డిస్కంల అంచనా. ఇదే నిజమైతే ఈ నెలలో 1500 మిలియన్ యూనిట్ల మేర పవన విద్యుత్తు అందుబాటులోకి రానున్నట్టు డిస్కంలు పేర్కొంటున్నాయి.
పవర్ హాలిడే 15 రోజులు పొడిగింపు
ఇప్పటికే పరిశ్రమలకు పవర్ హాలిడేను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్నది. విద్యుత్తు డిమాండ్ దృష్ట్యా మే 15 వరకు పవర్ హాలిడే పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. ఇప్పటికే నష్టాలతో నడుస్తున్న ఎన్నో చిన్నాచితకా పరిశ్రమలు మూతపడే ప్రమాదం పొంచివున్నది. విద్యుత్తు విరామాన్ని కొనసాగించాలన్న డిస్కంల నిర్ణయంతో పరిశ్రమల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతున్నదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.