హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : వారం రోజుల్లో విద్యుత్తు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పవర్ ఎంప్లాయీస్ జేఏసీ సర్కార్‌కు అల్టిమేటం జారీచేసింది. వారంలో పరిష్కరించకపోతే మెరుపు సమ్మెకు దిగుతామని జేఏసీ హెచ్చరించింది. ఈ నెల 27 నుంచి ఉద్యమానికి పూనుకోనున్నట్టు కార్యాచరణ ప్రకటించింది. ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల సర్కిల్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్లలో రిలే నిరాహార దీక్షలకు దిగుతామని జేఏసీ ప్రకటించింది. ఆ తర్వాత వారంలో మూడు రోజులకు ఒకటి చొప్పున దశలవారీగా ఉద్యమానికి దిగుతామన్నది.
జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నియోజకవర్గాల్లో ఆందోళనలు, ఎమ్మెల్యే కార్యాలయాలు ముట్టడి, వినతిపత్రాల సమర్పణ వంటి వాటితో ఉద్యమిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో పవర్ ఎంప్లాయీస్ జేఏసీ బుధవారం విద్యుత్తు సౌధలో మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా పలు సంఘాల నేతలు మాట్లాడుతూ.. సర్కార్ అలసత్వాన్ని విద్యత్తు సంస్థల యాజమాన్యాల మొండి వైఖరిని తీవ్రంగా నిరసించారు. యాదాద్రి పవర్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని జేఏసీ డిమాండ్ చేసింది.
ప్లాంట్ ఔట్‌సోర్స్ టెండర్లను ఫైనల్ చేస్తే మెరుపు యాక్షన్‌కు దిగుతామని జేఏసీ హెచ్చరించింది. వేతన సవరణకు తక్షణమే ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని కోరింది. జేఏసీతో చర్చలు జరిపి.. న్యాయమైన పరిష్కారం చూపాలని డిమాండ్ చేసింది. సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించింది. ఈ మహాధర్నాలో జేఏసీ కన్వీనర్ రత్నాకర్‌రావు, పీ సదానందం, శివశంకర్, నెహ్రూ, సురేష్‌కుమార్, బీసీరెడ్డి, వజీర్, తాజుద్దీన్‌బాబా, కరుణాకర్‌రెడ్డి, రాంజీ, రాధాకృష్ణ, కేవీ రామారావు, స్వామి, సత్యనారాయణరావు, వెంకటేశ్వర్లు, యుగంధర్, అశోక్‌కుమార్, అనిల్‌కుమార్, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలపై డిప్యూటీ సీఎం స్పందించడంలేదు: సాయిబాబా, జేఏసీ చైర్మన్
విద్యుత్తు ఉద్యోగుల సమస్యలపై డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క స్పందించడంలేదని పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సాయిబాబా ఆరోపించారు. సమస్యలు పరిష్కరించాలని నోటీసులిచ్చినా యాజమాన్యం పిలిచి చర్చించకపోవడం అత్యంత బాధాకరమని వాపోయారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి విస్మరించారని ఆరోపించారు. విద్యుత్తు సంస్థల్లో జీతాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. తాము ప్రమాదకరమైన విద్యుత్తుతో నిత్యం భయం భయంతో పనిచేస్తున్నామని.. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నామని వాపోయారు. మహాధర్నాతో యాజమాన్యం దిగి వచ్చి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు.
20వేల ఖాళీలు భర్తీ చేయాలి: శ్రీధర్, జేఏసీ సెక్రటరీ జనరల్
విద్యుత్తు సంస్థల్లో 20వేల ఖాళీ పోస్టులున్నాయని.. వీటిని తక్షణమే భర్తీ చేయాలని జేఏసీ సెక్రటరీ జనరల్ ఈ శ్రీధర్ డిమాండ్ చేశారు. విద్యుత్తు సంస్థల యాజమాన్యం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. యాజమాన్యం తీరును నిరసిస్తూ ఉద్యోగులంతా ఆందోళనకు పూనుకోవాల్సి వచ్చిందని వివరించారు. విద్యుత్తు సెక్టార్ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని.. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని, లేదంటే మెరుపు సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు. విద్యుత్తు సంస్థలను కాపాడుకుంటూ హక్కుల సాధనకు ఉద్యమిస్తామని పేర్కొన్నారు.
బెదిరింపులకు లొంగకుండా..
జేఏసీ మహాధర్నాతో విద్యుత్తు సౌధ కిక్కిరిసిపోయింది. పలు ప్రాంతాల నుంచి ఉద్యోగులు, ఇంజినీర్లు, పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉద్యోగుల ఐక్యతను చాటారు. న్యాయమైన హక్కుల సాధనకు పోరాట స్ఫూర్తిని చాటిచెప్పారు. మొత్తంగా విద్యుత్తు సౌధ ప్రాంతమంతా మహాధర్నాకు వచ్చిన వారితో నిండిపోయింది. మహాధర్నాను అడ్డుకునేందుకు జెన్కో యాజమాన్యం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. విద్యుత్తు సంస్థల్లో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరికలు జారీచేసింది. తమ ఆదేశాలు ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఏకంగా మంగళవారం సర్క్యులర్ జారీచేసింది. మొత్తంగా యాజమాన్యం బెదిరింపులకు లొంగకుండా ఉద్యోగులంతా కదం తొక్కారు. విద్యుత్తు సౌధలో నినాదాలతో హోరెత్తించారు.