భీమదేవరపల్లి, జనవరి 28 : నిత్యం కూలి పనిచేస్తే తప్ప పూటగడవని ఇంట విద్యాకుసుమం వెల్లివిరిసింది. కష్టపడిచదివి జర్మనీ యూనివర్సిటీలో ఉచిత సీటు సంపాదించి నా అక్కడికి వెళ్లేందుకు ఆర్థిక స్థోమ త అడ్డంకిగా మారింది. వెళ్లేందుకు కనీసం రూ.15 లక్షలు అవసరమ ని.. దాతలు సాయం చేసి ఉన్నత విద్యకు సహకరించాలని కోరుతున్నాడు అలుగు శ్రీనాథ్. శ్రీనాథ్ స్వస్థలం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరు. తండ్రి రాజకొమురయ్య కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొడుకు శ్రీనాథ్‌ను కష్టపడి చదివించాడు. ఎర్రగట్టు వద్ద కిట్స్ కళాశాలలో బీటెక్ (మెకానికల్) ఇటీవలే పూర్తిచేశాడు. 90 శాతానికిపైగా మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఈ క్రమంలో జర్మనీలోని ఒట్టోఫాన్ గ్యూరిక్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ సీటు వచ్చింది. రెండేండ్లపాటు అక్కడ కోర్సు చేయాల్సి ఉండగా శ్రీనాథ్‌కు పేదరికం అడ్డొచ్చింది. ఉచితంగా సీటు లభించినా హాస్టల్, ట్రాన్స్‌పోర్టు, అకామిడేషన్ తదితరాలు కలిపి మొత్తం రూ.15 లక్షలు వచ్చే నెల 9లోగా తన అకౌంట్లో జమ చూపించాల్సి ఉన్నది. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం నుంచి వచ్చిన తనను దాతలు ఆదుకోవాలని శ్రీనాథ్ వేడుకొంటున్నాడు. తన అకౌంట్ నంబర్: 40355429039, ఎస్బీఐ ములుకనూరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్ 0020277కు సాయం పంపాలని కోరుతున్నాడు. ఫోన్ నంబర్ 7780623783. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన శ్రీనాథ్‌ను ఎంపీపీ జక్కుల అనిత-రమేశ్, జడ్పీటీసీ వంగ రవి, ఎంపీడీవో భాస్కర్ అభినందించారు. తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని, దాతలు ముందుకురావాలని వారు కోరారు.