గద్వాల: ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ (Bird Flu) కలకలం సృష్టిస్తున్నది. రెండు జిల్లాల పరిధిలో భారీగా కోళ్లు మృతిచెందుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వచ్చే కోళ్ల లారీలను అడ్డుకోవాలని అధికారులను ఆదేశించింది. దీంతో రాష్ట్ర సరిహద్దుల్లోనే కోళ్ల వ్యాన్లను నిలిపివేస్తున్నారు. ఇందులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా వద్ద 44వ జాతీయ రహదారిపై అధికారులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ఏపీ నుంచి వచ్చిన రెండు లారీలను అడ్డుకుని.. తిప్పి పంపించారు. సోమవారం కూడా ఐదు లారీలను వెనక్కి తిప్పి పంపించామని ఉండవల్లి ఎస్ఐ మహేశ్ గౌడ్ వెల్లడించారు.
ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం..
బర్డ్‌ఫ్లూ కారణంగా తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో వరుసగా కోళ్లు పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు మృతి చెందిన కోళ్ల శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా బర్డ్‌ఫ్లూగా తేలింది. తూర్పు గోదావరి జిల్లా కానూరు అగ్రహారం, వేల్పూరులోనూ ఓ కోళ్లను నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపగా.. బర్డ్‌ఫ్లూగా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో అధికారులు అగ్రహారం పరిధిలోని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. మరో వైపు బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయ్యిన ప్రాంతంలో చికెన్ దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
గ్రామానికి పది కిలోమీటర్ల పరిధిలో సర్వేలెన్స్ జోన్‌గా నిర్ణయించారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఫౌల్ట్రీలు ఉండడంతో పాటుగా కోళ్లు మృతి చెందడంతో ఆ పరిధిలో రెడ్‌జోన్‌గా ప్రకటించి.. పది కిలోమీటర్ల పరిధిలో సర్వేలెన్స్ జోన్లుగా గుర్తించాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. అధికారులతో సమావేశం నిర్వహించి ఈ వైరస్‌ను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో జనం కొద్దిరోజులు చికెన్ తినడం మానుకోవడం మంచిదని కలెక్టర్ సూచించారు. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరాను వారం పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కానూరు అగ్రహారం మినహా మరెక్కడా బర్డ్‌ఫ్లూ ప్రభావం లేదని.. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ సూచించారు.
అయితే, బర్డ్‌ఫ్లూ వలస పక్షుల కారణంగా సోకి ఉండవచ్చని పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ దామోదర నాయుడు పేర్కొన్నారు. వలస పక్షుల్లో ఉండే వైరస్ వాటి రెట్టల ద్వారా జలాశయాల్లోకి చేరుతోందని.. అక్కడి నుంచి నీరు, ఇతర మార్గాల ద్వారా కోళ్లకు సంక్రమిస్తూ ఉండవచ్చన్నారు. బర్డ్‌ఫ్లూ సాధారణంగా ఎక్కడో ఒక చోట వస్తూనే ఉంటుందని.. కేంద్రం ఆదేశాల మేరకు అన్ని నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వైరస్ కారణంగా నష్టపోయిన ఫౌల్ట్రీ రైతులకు పరిహారం అందజేస్తామన్నారు. మరో మిర్తిపాడులో బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టించింది. ఒకే రోజు ఎనిమిది వేలకుపైగా కోళ్లు మృతి చెందాయి. దాంతో రెండు కిలోమీటర్ల పరిధిలో బఫర్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. మరో వైపు అధికారులు బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో చికెన్ తినొద్దని ఇంటింటా ప్రచారం చేస్తున్నారు.