హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : మేమంతా ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నం. సిలబస్‌ను ఇంత తక్కువ రోజుల్లో చదవలేకపోతున్నా.. సీఎం రేవంత్సార్.. మా గోడును అర్థం చేసుకోండి. డీఎస్సీని మూడునెలలు వాయిదా వేయాలని పలువురు డీఎస్సీ అభ్యర్థులు కోరారు. డీఎస్సీ వాయిదాపై ప్రభుత్వం తన మొండి వైఖరి వీడకపోవడంతో పలువురు మహిళా అభ్యర్థులు వీడియోలను సోషల్‌మీడియాలో పోస్టుచేశారు. కన్నీటిపర్యంతమవుతూ తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ వీడియోలను చూసి అయినా.. సీఎం రేవంత్ కర్కశమైన మసను కరుగుతుందేమోనని ఆశాభావం వ్యక్తంచేశారు. డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనల వెనుక బీఆర్ఎస్, కోచింగ్ సెంటర్ల మాఫియా ఉందన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను అభ్యర్థులు తిప్పికొట్టారు. తమ వెనుక ఏ పార్టీ లేదని, ఏ కోచింగ్ సెంటర్లేదని ఆయా వీడియోల్లో స్పష్టతనిచ్చారు.
తక్కువ సమయం..ప్రిపేర్ కాలేము
టెట్‌కు డీఎస్సీకి మధ్యలో చాలా తక్కు వ సమయమిచ్చారు. మధ్యలో హెచ్‌డబ్ల్యూ వో, సీటెట్ ఎగ్జామ్ వల్ల డీఎస్సీకి సరిగ్గా ప్రిపేర్కాలేకపోయినం. మాకు సమయం సరిపోవడంలేదు. స్కూల్ అసిస్టెంట్ వాళ్లం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సిలబస్‌ను చదవాలి. ఎగ్జామ్‌ను వాయిదావేసి సెప్టెంబర్‌లో పరీక్ష పెడితే డిసెంబర్‌లోపు ప్రక్రియ పూర్తవుతుంది. దయచేసి అర్ధం చేసుకోండి. డీఎస్సీ ఎగ్జామ్‌ను వాయిదావేయండి.
-ఓ నిరుద్యోగి
మా బాధలు వినరా ?
కొద్దిరోజలుగా మేం డీఎస్సీని వాయిదా వేయాలని ధర్నాలు చేస్తున్నాం. దీనిని సీఎం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిరుద్యోగులే తమ బాధలను వ్యక్తపరుచుకోవడానికి బయటికొస్తున్నారు. పోలీసులు మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు. కనీసం మా బాధలు వినరా ? జూన్ నెలలో వరుసగా పరీక్షలు పెట్టారు. కనీసం సిలబస్‌ను రివిజన్ చేసేందుకు వీలుపడటంలేదు. దీంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నాం. దీంట్లో ఏ పార్టీ ఇన్వాల్వ్కాలేదు. కోచింగ్ సెంటర్ల ప్రమేయం లేదు. మేమే వాయిదావేయమని కోరుతున్నాం.
– ఓ నిరుద్యోగి
మావి పేదబతుకులు సార్..
నేనొక డీఎస్సీ అభ్యర్థిని. మాకు ఎవరితో.. ఏ రాజకీయ పార్టీలతో సంబంధంలేదు. మేం నిరుద్యోగులం.పేదబతుకులు మావి. జాబ్‌లు వస్తేనే మా జీవితాలు మారుతాయి. దయచేసి కనీసం మాకు రెండు నుంచి మూడు నెలల సమయమివ్వండి. మేం కోరేది అంతే. ఈ మూడు నెలల్లో శ్రద్ధగా చదువుకుంటం. మా జీవితాన్ని బాగుచేసుకుంటం. మీ చెల్లెలిగా వాయిదావేయాలని కోరుతున్నం.
– ఓ నిరుద్యోగి
50 పుస్తకాలు ఎలా చదవాలి?
నేను డైట్ పూర్తిచేశాను. డీఎస్సీకి చదవలేకపోతున్నాను. మాకు భారీ సిలబస్ పెట్టారు. ఎస్జీటీ టీచర్ 50 పుస్తకాలు చదవాలి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పుస్తకాలు చదవాల్సి వస్తోంది.జీకే, కరెంట్ ఆఫైర్స్, విద్యాదృక్పథాలు ఇలా అనేక సబ్జెక్టులున్నాయి. ఏవిధంగా ప్రయత్నించినా సిలబస్ పూర్తికావడంలేదు. మీరేమో వేరే రాజకీయ పార్టీ వాళ్లమని, వాళ్లే ధర్నాలు చేపిస్తున్నారని ముద్రవేస్తున్నారు. మేం అలాంటి వాళ్లం కాదని ఎట్లా నిరూపించుకోవాలో మాకు అర్థం కావడంలేదు. మా ఆవేదనను గుర్తించి.. డీఎస్సీని వాయిదావేయండి.
– ఓ నిరుద్యోగి
ఈ ప్రభుత్వమొచ్చి ఏం ప్రయోజనం
మాకు ఇద్దరు ఆడపిల్లలు.భార్యాభర్తలం ఉద్యోగం మానేసి డీఎస్సీకి ప్రిపేరవుతున్నం. మాకు న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వమొచ్చి ఏం ప్రయోజనం. నేనే కాదూ నాలాగా ఏడుస్తున్నవాళ్లు, కొట్లాడుతున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయినా ప్రభుత్వం స్పందించడంలేదు. ప్రతిపక్షాలు చేస్తున్నాయమంటున్నారు తప్ప విద్యార్థుల బాధలు పట్టించుకోవడం లేదు. సీఎం రేవంత్ స్పందించకపోతే ఎంతో మంది జీవితాలు నాశనం కావడం తథ్యం. కనీసం రెండు నెలలు డీఎస్సీని వాయిదావేయాలి.
-శారద, కరీంనగర్
మీ కాళ్లు మొక్కుతాం..
నాకు ముగ్గురు పిల్లలున్నారు. వారికి సపర్యలు చేసి చదువుకునేందుకు ఇబ్బంది పడుతున్నా. టెట్‌కు డీఎస్సీకి మధ్య టైం 20 రోజులే ఉంది. డీఎస్సీ సిలబస్ అధికంగా ఉంది. మీ కాళ్లు మొక్కుతా.. దండం పెడతా డీఎస్సీని వాయిదా వేయండి సార్. నాభర్త నాపై చాలా నమ్మకం పెట్టుకున్నడు. మీరు బీఆర్ఎస్ వాళ్లు చేపిస్తున్నారని అంటున్నరు. అదేంలేదు. మా సొంతంగా చేస్తున్నాం. మీ కాళ్లు మొక్కుతాం డీఎస్సీని పోస్ట్‌పోన్ చేయండి సార్.
– ఓ నిరుద్యోగి