హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారుల తీరుపై సొంతసిబ్బంది విమర్శలు గుప్పిస్తున్నారు. నిబంధనలను పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా పోస్టింగ్స్ ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇటీవల బీసీ సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్, ఓ జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఉద్యోగ విమరణ చేశారు. ఆ స్థానంలో ఇన్చార్జిగా ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్న అధికారిని నియమించడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్లు, జూనియర్లనే వివాదానికి తెరతీసింది. వాస్తవంగా డీబీసీడీవో పోస్ట్ డీడీ (డిప్యూటీ డైరెక్టర్) క్యాడర్‌కు సంబంధించినదని, అందుకు విరుద్ధంగా ఏడీ (అసిస్టెంట్ డైరెక్టర్)ను ఆ స్థానంలో నియమించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు ఏడీ ఇప్పటికే రెండు కార్పొరేషన్లకు ఎండీగా, మరో కీలకమైన పథకానికి సెక్షన్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. తనకు అదనపు బాధ్యతలు వద్దని సదరు అధికారే మొత్తుకుంటున్నా ఆయనకు బలవంతంగా బాధ్యతలను అప్పగించడం కొసమెరుపు. ఇదిలాఉంటే గురుకుల సొసైటీకి కార్యదర్శిగా పనిచేసిన బీసీ సంక్షేమశాఖ ఏడీ (అడిషనల్ డైరెక్టర్) మల్లయ్యభట్టు.. సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఇటీవలనే తిరిగి ఆయనను సొంతశాఖకు పంపిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కానీ 10 రోజులు గడిచినా ఆయనకు ఎలాంటి బాధ్యతలను అప్పగించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే సొసైటీ ఉన్నతాధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని సిబ్బంది విమర్శలు గుప్పిస్తున్నారు.
హాస్టల్ వెల్ఫేర్ అధికారుల బదిలీల్లో కూడా ఓ కీలక అధికారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అధికారులు మండిపడుతున్నారు. సర్వీస్ నిబంధనలను మారుస్తూ సీనియార్టీ లిస్టును ప్రకటించకుండా జాప్యం చేస్తున్నారని హెచ్‌డబ్ల్యూవోలు నిప్పులు చెరుగుతున్నారు. చివరి నిమిషంలో సీనియార్టీ లిస్టు విడుదల చేసి, సమయమివ్వకుండా హడావిడిగా ఐచ్చికాలను తీసుకునే కుట్రలకు తెరలేపారని మండిపడుతున్నారు. వాస్తవంగా బీసీ సంక్షేమశాఖలో హాస్టల్ వెల్ఫేర్ అధికారి గ్రేడ్-2 ఉద్యోగులకు సంబంధించి ప్రీమెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ అనే రెండు విభాగాలున్నాయి. ఇందులోనూ ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్‌లో బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతి గృహాలతో మొత్తంగా నాలుగు ప్రత్యేక విభాగాలున్నాయి. ఈ నాలుగు విభాగాల్లో ఖాళీల భర్తీకి విడివిడిగా ప్రత్యేక రోస్టర్ విధానం ప్రకారం నియామకాలు, బదిలీలను నిర్వహిస్తున్నారు. 2022లో మార్చిన రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా విడుదల చేసిన 317 జీవో ప్రకారం చేపట్టిన బదిలీల ప్రక్రియలోనూ సీనియర్టీలిస్టు ప్రకారం బదిలీలు చేపట్టారు. ఇప్పుడు గతంలో వలె కాకుండా ప్రీ మెట్రిక్బాయ్స్, పోస్ట్ మెట్రిక్ బాయ్స్ వసతి గృహాలను కలిపి ఒక కామన్ లిస్టు, ప్రీ మెట్రిక్ గర్ల్స్, పోస్ట్ మెట్రిక్ గర్ల్స్లను కలిపి మరో కామన్ లిస్టు తయారు చేసి బదిలీలు, ప్రమోషన్లు కల్పించాలని చూస్తున్నారని హెచ్‌డబ్ల్యూవోలు వాపోతున్నారు. దీనివల్ల వల్ల తాము తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని ప్రీ మెట్రిక్ వసతి గృహ సంక్షేమ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.
హైదరాబాద్, జూలై10 (నమస్తే తెలంగాణ): వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ల నిర్వహణకు ప్రభుత్వం రూ.6.25కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.