‘చేసిన కష్టమంతా ఇంటి కిరాయికే పోతున్నది. ఇక పిల్లలను ఎలా చదివించుకోవాలె. మేమెట్ల బతుకాలె. ఎక్కడో ఇండ్లు ఇచ్చి పదే పదే ప్రచారం చేసుకోవడం కాదు.. రాష్ట్రంలో ప్రతి పేదవాడికీ ఇల్లు అందిందో లేదో చూసుకోవాలి. నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. నాలుగు కార్లు వేసుకొని తిరుగడం కాదు.. మీరు స్వయంగా పాదయాత్ర చేస్తే పేదల సమస్యలు ఏమిటో తెలుస్తాయి.. ఇవి పిచ్చిగీతలు అనుకోవద్దు.. ఆ పేదలే తలుచుకుంటే రాజకీయ పార్టీలను గెలిపించలరు.. గద్దె దించగలరు.’
సైదాబాద్, జూన్ 15: సచివాలయంలోని మీడియా సెంటర్ వద్ద ఇలా గుర్తు తెలియని వ్యక్తులు అంటించిన పోస్టర్లు కలకలం రేపాయి. ఉచిత పథకాలకు వ్యతిరేకంగా, నిరుద్యోగులు కొలువులు, నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకపోవటంపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ పోస్టర్లను గోడలకు అతికించారు. తెలంగాణ రమ్య అనే పేరుతో పూర్తిగా చేతిరాతతో రాసి ఉన్న ఈ పోస్టర్లలోని అంశాలు ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గెలిచేవరకు ఒక మాట.. గెలిచిన తర్వాత మరోమాట చెబుతున్నారంటూ ప్రభుత్వ తీరును సదరు మహిళ ఆ పోస్టర్ల ద్వారా తీవ్రంగా ఎండగట్టారు. ఈ పోస్టర్లను గమనించిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది వాటిని తక్షణమే తొలగించారు. అనంతరం పోస్టర్లు అంటించిన మహిళను అదుపులోకి తీసుకొని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.
హైదరాబాద్లో పాదయాత్ర చేయాలి
హైదరాబాద్ నగరంలోని మధ్యతరగతి, పేద ప్రజల కష్టాలను ప్రస్తావిస్తూ.. పల్లెటూర్లలో పాదయాత్ర చేసినట్టు కాకుండా నగరంలో పాదయాత్ర చేయాలని ఆ పోస్టర్ ద్వారా డిమాండ్ చేశారు. అప్పుడే హైదరాబాద్లో ఎంతమంది అద్దె ఇండ్లలో ఉంటూ నరకం చూస్తున్నారో పాలకులకు అర్థమవుతుందని అందులో పేరొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పడం కాదు.. రాష్ట్రంలో అసలు ఇల్లు లేని వారంటూ ఎవరూ ఉండకుండా చూడాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మద్యం తాగే సామాన్యులను కాదు, ఆ మద్యం తయారు చేసే పెద్ద కంపెనీల యజమానులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ‘ఇవి పిచ్చిగీతలు అనుకోకండి.. పేదలు తలచుకుంటే రాజకీయ పార్టీలను గెలిపించాలన్నా, గద్దె దించాలన్నా వారి చేతుల్లోనే ఉంది. ప్రజల సమస్యలను పట్టించుకోకుంటే ఎకడినుంచి వచ్చారో అకడికే వెళ్తారు. తెలంగాణ సంపద అందరిదీ అని అంబేదర్ చెప్పాడు.. కానీ ఇప్పుడు కొంతమంది చేతుల్లోనే ఆ సంపద ఉండిపోయింది’ అని ఆవేదన వ్యక్తంచేశారు.