వనస్థలిపురం, ఆగస్టు 4: ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసగా మారిన పోస్టల్ ఉద్యోగి.. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి, ఆత్మహత్యకు చేసుకున్న ఘటన హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మన్సూరాబాద్ డివిజన్ సహారా స్టేట్స్లో నివాసముండే ఆనెం నరేశ్ (38) ఆటోనగర్ పోస్టాఫీస్‌లో సార్టింగ్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ఆరేండ్లుగా బెట్టింగ్‌కు బానిసగా మారిన నరేశ్.. పలు యాప్‌లలో రూ.15 లక్షలు నష్టపోయాడు. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకున్నాడు. అప్పులు తీర్చేందుకు వచ్చిన జీతం సరిపోలేదు. కొంతకాలంగా మనస్తాపానికి గురైన ఆయన.. సోమవారం మధ్యాహ్నం తనకు కాలు నొప్పి ఉందని, మెడికల్ షాపులో మందులు తీసుకురమ్మని భార్య కీర్తిని పంపించాడు.
ఆమె బయటకు వెళ్లిన తర్వాత.. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ షాపు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత భర్త ఉరివేసుకున్నట్టు గుర్తించిన భార్య.. గట్టిగా అరవడంతో ఇరుగుపొరుగు వచ్చారు. వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు తీవ్ర ఆవేదనతో సూసైడ్ లెటర్ రాశాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని, బెట్టింగ్ గేమ్స్‌కు బానిసై డబ్బులు నష్టపోవడంతో బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు పేర్కొన్నాడు.
‘మోదీ సార్.. దయచేసి ఇండియాలో అన్ని బెట్టింగ్ యాప్‌లు బ్యాన్ చేయండి. లేదంటే యువత తమ కెరియర్ను, జీవితాలను, ప్రాణాలను పోగొట్టుకుంటారు’ అని విజ్ఞప్తి చేశాడు. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి తన భార్యకు రావాల్సిన బెనిఫిట్స్ తొందరగా ఇప్పించాలని ఉన్నతాధికారులను కోరాడు. నరేశ్‌కు ఆరేండ్ల కూతురు ఉంది. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.