TREIB | హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) పారదర్శకతకు పాతరేసింది. అసమగ్ర నియామక ప్రక్రియతో అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నది. మిగతా బోర్డులకు భిన్నంగా ఈసారి పోస్టుల భర్తీ ప్రక్రియను నిర్వహిస్తున్నదని అభ్యర్థులు నిప్పులు చెరుగుతున్నారు. తమ గోడును పట్టించుకోకుండా పోస్టుల భర్తీ చేపడుతుందని వారంతా గగ్గోలు పెడుతన్నారు.
ప్రస్తుతం చేపట్టిన 9,210 పోస్టుల భర్తీలో ఏ మాత్రం ప్రణాళికాబద్ధంగా, పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర బోర్డులు నిర్ణీత గడువును ఇచ్చి పోస్టులను భర్తీ చేస్తుండగా, అందుకు విరుద్ధంగా ట్రిబ్ గోపత్యను పాటిస్తూ, రాత్రికిరాత్రే ఫలితాలను వెల్లడించింది. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించిన తొలుత 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఆహ్వానించింది.
ఇతర రిక్రూట్మెంట్ బోర్డులు రోజుకు 100 మంది చొప్పున మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించగా, ట్రిబ్ మాత్రం అందుకు భిన్నంగా సబ్జెక్టుల వారీగా 1:2 జాబితాలో ఉన్న అభ్యర్థులందరికీ ఒక్క రోజులోనే, అదీ అర్ధరాత్రి దాటేవరకూ సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగించింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే తుది జాబితాను ప్రకటించింది. ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థి హాల్‌టికెట్ నంబర్, రాతపరీక్షలో సాధించిన జనరల్ ర్యాంకు, అభ్యర్థి సాధించిన మార్కులను ప్రకటించాల్సి ఉన్నది. జీఆర్ఎల్ జాబితాను బోర్డు సైట్లో పొందుపరచాల్సి ఉన్నది. 2018, 2019లో ట్రిబ్ సైతం ఈ విధానాన్ని పాటించింది. కానీ ఇప్పుడు మాత్రం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటకీ జీఆర్‌ఎల్‌ను ప్రకటించనేలేదు.
అభ్యర్థులు తమ మార్కులు, ఇతర వివరాల కోసం ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరినా ట్రిబ్ మాత్రం దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నది. ‘నియామక ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతున్నది. మీరు అడిగిన సమాచారం ఇవ్వడం ఈ పరిస్థితుల్లో సాధ్యం కాదు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం పూర్తయ్యాక మీరు కోరిన సమాచారాన్ని బోర్డు సైట్లోనే పెడతాం. అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు’ అంటూ ట్రిబ్ పేర్కొనడం గమనార్హం. దీంతోనే అభ్యర్థుల్లో మరిన్ని అనుమానాలకు ఆజ్యం పోస్తున్నది. జీఆర్‌ఎల్‌ను ప్రకటించకపోయినా కనీసం వ్యక్తిగత ఐడీలోనూ వివిధ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల మార్కులనూ వెల్లడించకపోవడం గమనార్హం. ట్రిబ్ ఎందుకు ఇంతలా గోప్యత పాటిస్తున్నదని అభ్యర్థులు నిలదీస్తున్నారు. దీంతోనే రిక్రూట్మెంట్ తీరుపై అభ్యర్థులు మండిపడుతున్నారు.
గురుకుల సొసైటీల పోస్టులను ట్రిబ్ ఆధ్వర్యంలోనే భర్తీ చేస్తున్నారు. ఆ సొసైటీల సెక్రటరీల్లో ఎవరు సీనియర్ అధికారిగా ఉంటారో వారు చైర్మన్‌గా, తదుపరి సీనియర్ అధికారి కన్వీనర్‌గా కొనసాగుతారు. మిగతా సొసైటీల సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు. అయితే ప్రస్తుతం ఒకవైపు గురుకుల పోస్టు ల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నా ఇప్పటికీ కన్వీనర్‌గా ఎవరినీ నియమించకపోవడం, బాధ్యతలు అప్పగించకపోవడం గమనార్హం. గతంలో ట్రిబ్ కన్వీనర్‌గా వ్యవహరించిన మల్లయ్య భట్టును నియామక ప్రక్రియ మధ్యలో మార్చి నెలలోనే ప్రభుత్వం బదిలీ చేసింది. నాటి నుంచి కన్వీనర్‌గా ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. సొసైటీల్లో ప్రస్తుతం సీనియర్ సెక్రటరీగా ఆయేషా మస్రత్ ఖానం ట్రిబ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆ తర్వాత సీనియర్‌గా మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల సొసైటీ సెక్రటరీ సైదులు ఉన్నా రు. ఆయనకు సైతం ప్రభుత్వం కన్వీనర్‌గా బాధ్యతలను అప్పగించలేదు. కన్వీనర్ లేకుండా సొసైటీ పోస్టుల నియామక ప్రక్రియను కొనసాగిస్తుండటం కొసమెరుపు.