హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): నర్సింగ్ రిజిస్ట్రార్ పోస్టు భర్తీ అంశంలో కాంగ్రెస్ సర్కారు తీవ్ర జాప్యం చేస్తున్నది. ఈ ఏడాది అక్టోబర్ 31న గత రిజిస్ట్రార్ ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి రిజిస్ట్రార్ పోస్టు ఖాళీగానే ఉన్నది. 45 రోజులు కావస్తున్నా.. పూర్తి స్థాయి రిజిస్ట్రార్‌ను నియమించలేదు. నర్సింగ్ రిజిస్ట్రార్ పోస్టుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. తర్వాత దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిశీలించి అర్హత ఉన్న వారిని రిజిస్ట్రార్‌గా నియమించాల్సి ఉంటుంది.
క్యాబినెట్ ఆమోదం తెలిపినా..
మరోవైపు ఇతర రాష్ర్టాల్లో నర్సింగ్ రంగానికి ప్రత్యేకంగా డైరెక్టరేట్ ఉండగా.. మన రాష్ట్రంలో మాత్రం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)లో భాగంగానే నర్సింగ్ కౌన్సిల్ పనిచేస్తున్నది. దీంతో నర్సింగ్ ఆఫీసర్ల పనులు పెద్ద ఎత్తున పెండింగ్‌లో పడిపోతున్నాయి. ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, శాఖాపరమైన వ్యవహారాల్లో జాప్యం కారణంగా నర్సింగ్ ఆఫీసర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల నర్సింగ్ డైరెక్టరేట్ కోసం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినా.. ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ నియామక ప్రక్రియను మెరిట్ ఆధారంగా పారదర్శకంగా చేపట్టాలని ఇటీవల కొంత మంది నర్సింగ్ ఆఫీసర్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసి వినతి పత్రం అందజేశారు.