మెట్పల్ల్లి, నవంబర్ 19 : ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు సమయానికి అందడం లేదు. చెక్కులు చేతికందినా గడువు ముగియడంతో ప్రయోజనం లేకుండా పోతున్నది. కొత్త వాటి కోసం గడువు ముగిసిన చెక్కులను తిరిగి సీఎం పేషీకి పంపించక తప్పడం లేదు. కొద్ది రోజుల కిందట ఇ బ్రహీంపట్నం డబ్బ గ్రామానికి చెంది న ఓ మహిళకు సీఎంఆర్ఎఫ్ కింద రూ.15 వేలు మంజూరయ్యాయి. వాటికి సంబంధించిన చెక్కును 2024 జూలై 12న జారీ చేశారు. కానీ, లబ్ధిదారు చేతికి మాత్రం 4 నెలల తర్వాత అందింది. ఆమె 14 నెలల కింద వైద్యానికి రూ.1.50 లక్షలు ఖర్చవగా అంత మొత్తానికి సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా కేవలం రూ.15 వేలు మాత్రమే మంజూరయ్యాయి. అదే గ్రామానికి చెందిన మరో మహిళది అదే పరిస్థితి. ఆమెకు రూ.36 వేలు చెక్కు వచ్చినప్పటికీ జారీ చేసిన నిర్ణీత గడువులోపల చేతికందకపోవడంతో మళ్లీ దాని స్థానంలో కొత్త చెక్కు కోసం తిరిగి పంపినట్టు తెలిసింది.