ఖమ్మం : ఎవుసాన్ని పండుగ జేసిన భూమి పుత్రుడు సీఎం కేసీఆర్కు ఆర్తితో తెలంగాణ రైతాంగం హారతి పడుతున్నది. నీళ్లకు నడకనేర్పి, చెరువుల దూపతీర్చి, నెర్రెలు వారిన బీడు భూముల్లో గోదావరి జలాలను పరుగులు పెట్టిస్తూ..తెలంగాణను ధాన్యాగారంగా మారుస్తున్న నిత్య కృషీ వలుడికి జనం జేజేలు పలుకుతున్నారు.
రైతబాంధవుడికి రైతన్నలు విభిన్న పద్ధతుల్లో తమ అభిమానాన్ని చాటుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఎకరం పొలంలో వివిధ రకాల ఆహార ఉత్పత్తులు నవధాన్యాలతో ఆకర్షణీయంగా సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని తీర్చిదిద్ది రైతుపక్షపాతి సీఎంకు తమ పట్ల ఉన్న ప్రేమను ఆవిష్కరించారు.
ఈ అరుదైన ఘట్టానికి జిల్లాలోని సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామం వేదికైంది.
రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా నారాయణపురంలో పచ్చని పొలాల మధ్య వివిధ రకాల ఆహార ఉత్పత్తులైన పెసలు, మినుములు, జిలుకలు పెళ్లి పెసర్లు, శనగలు, బొబ్బర్లు వంటి విత్తనాలను గతకొద్ది రోజులుగా మొలకలుగా మలచి, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది ఔరా అనిపించారు.