హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : ‘మనకు టైం అంటే తెలుసు.. జీవితమంటే తెలుసు.. వారికేం తెలుసు ఆ..దున్నపోతు గానికి’ అంటూ సహచర మంత్రిని ఉద్దేశించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇన్చార్జి మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అందరూ వచ్చారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన సహచర మంత్రి ఒకరు సమయానికి రాలేకపోయారు. దీంతో పొన్నం అసహనానికి లోనయ్యారు. పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో గుసగుసగా ‘మనకు టైం అంటే తెలుసు.. జీవితమంటే తెలుసు.. వారికేం తెలుసు ఆ..దున్నపోతు గానికి’ అంటుండగా మైక్ స్పీకర్లు ఆన్‌చేసి ఉండటంతో అది బయటకు వినిపించింది. అప్పటికే మీడియా కెమెరాల్లో అదంతా రికార్డయింది. మళ్లీ కొద్ది నిమిషాలకే ‘వస్తుండా? స్టార్ట్ అయినంక జాయిన్ అయితాడా?’ అంటూ మైనార్టీ నేతలను ఉద్దేశిస్తూ ‘మొదలు పెట్టండి’ అని ఆర్డర్ వేసినట్టుగా పొన్నం మాట్లాడారు.
మరో మంత్రి లేకుండా ప్రెస్‌మీట్ ఎలా మొదలుపెడుతామని మెనార్టీ నేతలు సందిగ్ధంలో పడి వెనుకముందాడారు. దీంతో మరోసారి పొన్నం మైక్ అందుకొని ‘మీరు మాట్లాడుతారా? నన్ను మాట్లాడుమంటారా?’ అంటూ దబాయిస్తున్నట్టుగా మాట్లాడారు. ఇదంతా కెమెరాల్లో రికార్డయింది. మీడియా సమావేశం కవరింగ్ కోసం వచ్చిన యూట్యూబర్లు ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా, నిమిషాల్లోనే వైరల్ అయింది. దీంతో నాలుక కరుచుకున్న పొన్నం ప్రభాకర్ ఖండన ప్రకటన చేశారు.
‘పెద్దన్న అని పిలుచుకునే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సహచర మంత్రివర్యులను ఉద్దేశించి నేను అనని మాటలను అన్నట్టుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా వక్రీకరించింది’ అని సెలవిచ్చారు. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ఢిల్లీ వెళ్లే హడావుడిలో ఇంకా టికెట్స్ కన్ఫర్మ్ కావడానికి ఆలస్యమవుతున్నదంటూ ఏదో దాట వేసే ప్రయత్నం చేశారు. చివరికి ఇదంతా బీఆర్ఎస్ రాజకీయ నీచ బుద్ధికి నిదర్శనం అంటూ ఆ పార్టీపై బట్టకాల్చి మీద వేశారు.