హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరంపై చర్చకు రావాలని కేసీఆర్‌కు సవాల్ విసిరే స్థాయి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉన్నదా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. తెలంగాణకు రేవంత్‌రెడ్డి చేసిందేమిటి? తెలంగాణ సాధన, అభివృద్ధి, సమస్యల పరిష్కారంలో రేవంత్‌రెడ్డి పాత్ర, అనుభవం, అవగాహన ఎంత? అని ప్రశ్నించారు. తెలంగాణ సాధన, అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర ఏనాడూ మరువలేనిదని స్పష్టంచేశారు. తాము కూడా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఖర్గేను చర్చకు రావాలని సవాల్ విసరగలుగుతామని పేర్కొన్నారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి వాడుతున్న భాషపై అభ్యంతరం వ్యక్తంచేశారు. 120 రోజుల పరిపాలనపై, హామీల అమలుపై ఎందుకు మాట్లాడటంలేదని నిలదీశారు.
చర్చలనేవి వాస్తవాలు తెలుసుకోవడానికి, సమస్యల పరిష్కారానికి అనువుగా ఉండాలని, రాజకీయ ఆధిపత్యం, ఓట్ల కోసం ఉండొద్దని హితవు చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్రంలో సోలార్ విద్యుత్తు ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక రాయితీలు ఇచ్చిందని చెప్పారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో చెప్తున్న లెక్కలన్నీ తప్పు అని స్పష్టం చేశారు. కొన్ని జిల్లాల్లో ఇంకా వరి కోతలు ప్రారంభంకాలేదంటూ ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తుంటే, అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు ఉత్తమ్ చెప్పుకోవడం విడ్డూరమని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల సంఖ్యకు అనుగుణంగా ధాన్యం లెక్కలు ఎందుకు లేవని ప్రశ్నించారు. నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ నుంచి ఏపీ నీళ్లు తీసుకొనిపోతుంటే నోరుమెదపని అసమర్థ మంత్రి ఉత్తమ్ అని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ల కేటాయింపులో సామాజికవర్గాలకు తీవ్ర అన్యాయం చేసిందని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. మాదిగలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని, బీసీలకు మూడు మాత్రమే ఇచ్చారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ మాత్రం బీసీలకు ఆరు సీట్లు ఇచ్చిందని గుర్తుచేశారు. 2014, 2018, 2023, 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇచ్చిన సీట్లలో సామాజిక న్యాయం, కాంగ్రెస్ ఇచ్చిన సీట్లతో సామాజిక న్యాయాన్ని పరిశీలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలోనూ కాంగ్రెస్ వెనకబడిన వర్గాలకు అన్యాయం చేసిందని మండిపడ్డారు.