రామవరం/కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 28 : రాజకీయాలకు అతీతంగా ఉండే పాఠశాలల్లోనూ పొలిటీషియన్ల పుట్టినరోజు వేడుకలు జరిపి చిన్నారులను ఇబ్బంది పెడుతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం ట్రైబుల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో సోమవారం ‘హ్యాపీ బర్త్‌డే టు పొంగులేటి శ్రీనన్న’ అనే అక్షరాల ఆకారంలో కూర్చోబెట్టి ఫొటోలు తీసుకున్నారు. ఇందుకోసం సుమారు మూడు నుంచి నాలుగు గంటలు విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తి పూజ చేసే చర్యలు మంచివి కావని బీఆర్ఎస్వీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు ప్రోత్సహించిన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ నాగేంద్రమ్మను వివరణ కోరగా.. తాను కొత్తగా విధుల్లో చేరానని, ఎవరో వైస్ ప్రిన్సిపాల్‌ను అడిగితే పర్మిషన్ ఇచ్చారని, అది కూడా తమ గ్రౌండ్ పరిధిలోనే చేశామని, ఇక నుంచి అలా జరుగకుండా చూసుకుంటామని తెలిపారు. అలాగే పొంగులేటి జన్మదినాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆయన అనుచరులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. జాతీయ రహదారిపై ఎడ్లబండ్లు, వాహనాలతో పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించారు. దీంతో సుమారు గంటసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.