Ponguleti | రఘునాథపాలెం, జూలై 17: మాట మాట్లాడితే తనకే మస్తు ఆస్తులున్నయ్.. ప్రజల కోసం ఏమైనా చేస్తా.. ఎంతైనా ఖర్చు పెడతానంటూ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీరాలు పలుకుతుంటారు. కానీ, ఆయన కుటుంబం మాత్రం ప్రజల ఆస్తిని అక్రమంగా కాజేస్తున్నది. ఖమ్మం శివారులో పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డికి చెందిన ‘ఎస్ఆర్ గార్డెన్స్’లో ఉన్న 21.50 గుంటల భూమి ‘ఇరిగేషన్ స్థలం’ అని సోమవారం ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు తేల్చారు. ఖమ్మం అర్బన్ తహసీల్దార్ మేదరమెట్ల శైలజ పోలీసుల సహాయంతో చేపట్టిన సర్వేలో ఈ విషయం బయటపడింది.
అసలేం జరిగింది?
కాంగ్రెస్ పార్టీ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి 2022లో సర్వేనంబరు 140లోని 30 కుంటల భూమిని ఓ వ్యక్తి వద్ద కొనుగోలు చేశారని, ఆ భూమికి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇప్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సదరు పిటిషన్‌ను పరిశీలించి ఎనిమిది వారాల లోపు విచారించి ఎన్వోసీ జారీకి చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌శాఖ చీఫ్ ఇంజినీర్‌కు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు ఈ నెల 15న సర్వేకు హాజరు కావాలని ప్రసాద్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. నోటీసు ప్రకారం తాను కొనుగోలు చేసిన భూమికి హద్దులు చూపించేందుకు ఎన్వోసీ కోరిన వ్యక్తే హాజరుకావాల్సి ఉంటుంది.
కానీ ప్రసాద్‌రెడ్డి సర్వేకు గైర్హాజరయ్యారు. పైగా అధికారులు ఇచ్చిన నోటీసుపై హైకోర్టును ఆశ్రయించి అనారోగ్య కారణాలతో సర్వేకు హాజరు కాలేకపోతున్నానని కోర్టు నుంచి లంచ్ మోషన్ తెచ్చుకున్నారు. అధికారులు సోమవారం సర్వేకు హాజరు కావాలని మరోసారి ప్రసాద్‌రెడ్డిని కోరారు. సోమవారమూ సర్వేకు గైర్హాజరయ్యారు. ఆయన తరఫున ఎవరినీ అందుబాటులో ఉంచలేదు. అయితే.. కొందరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు సర్వే జరుగుతున్న స్థలం దగ్గరికి వచ్చి వీరంగం సృష్టించారు. పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల సాయంతో అధికారులు సర్వే కొనసాగించారు. సర్వే నంబర్ 140లోని ఇరిగేషన్ స్థలం 21.50 గుంటలు ఎస్ఆర్ గార్డెన్స్ ప్రాంగణ పరిధిలో ఉన్నట్టు గుర్తించి మార్కింగ్ వేశారు.
సర్వే నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తాం
పొంగులేటి ప్రసాద్‌రెడ్డి ఎన్వోసీ కోరిన మేరకు ఎన్నెస్పీ, రెవెన్యూ శాఖ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించారు. కానీ ఆయన రెండుసార్లు సర్వేకు హాజరు కాలేదు. సర్వే అధికారులు 21.50 గుంటల ఇరిగేషన్ భూమి ఎస్ఆర్ గార్డెన్స్ ఆక్రమణలో ఉన్నట్టు గుర్తించారు. ఈ సర్వే నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తాం.
-మేదరమెట్ల శైలజ, ఖమ్మం అర్బన్ తహసీల్దార్