కంఠేశ్వర్, ఆగస్టు 22: రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వేను వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ భూములతో పాటు ఆబాదీ ఆస్తుల రీసర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. శనివారం మంత్రి పొంగులేటి నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. అంతకు ముందు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రెవెన్యూ, హౌసింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే శాఖల అధికారులతో సమీక్షించారు.
సమస్యల పరిష్కారంలో ప్రజలను అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో కలెక్టర్లు, అధికారులు పర్యటించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణాలు, నగరాల్లో ఇండ్ల స్థలాలు లేని పేదల కోసం ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి విడుతలవారీగా ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, డాక్టర్ భూపతిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం మంత్రి పొంగులేటి పర్యటించే మార్గాల్లో విద్యార్థి సంఘాలు, బీఆర్ఎస్ నేతలపై ఉదయం నుంచే ఆంక్షలు విధించారు. పలువురిని గృహనిర్బంధంలో పెట్టారు. కలెక్టరేట్ సమావేశం మందిరం వద్ద బీజేపీ శ్రేణులు బైఠాయించి పొంగులేటి రాజీనామా చేయాలంటూ నినాదాలతో హోరెత్తించగా, అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు బీజేపీ డౌన్‌డౌన్, మోదీ డౌన్‌డౌన్ అంటూ ప్రతిగా నినాదాలు చేయడంతో పరిస్థితిఉద్రిక్తంగా మారింది. 22 ఏ విషయంలో తప్పు తనదేనని ఒప్పుకున్న పొంగులేటిని రేవంత్ సర్కార్ ఎందుకు రాజీనామా చేయించడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి ప్రశ్నించారు.