హైదరాబాద్, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ) : భూ భారతిలో సమస్యలు నిజమేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించారు. ఈ సమస్యలను ఇప్పట్లో పరిష్కరించలేమని కొంత సమయం పడుతుందని తెలిపారు. ఈమేరకు బుధవారం సచివాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 9.25 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం సవాల్‌గా మారిందని చెప్పారు.
ఇందులో అఫిడవిట్ నిబంధన ఇబ్బందిగా మారిందని అంగీకరించిన మంత్రి, ఈ నిబంధనను ఎత్తివేసేందుకు ఆలోచన చేస్తున్నామని చెప్పారు. త్వరలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసి భూధార్ నెంబర్ కేటాయిస్తామని వెల్లడించారు. అలాగే భూ సమస్యలకు సంబంధించిన వచ్చిన దరఖాస్తులను జనవరి నెలాఖరులోగా పరిష్కరిస్తామన్నారు. ఇక మాజీ సైనికులకు కేటాయించిన భూములకు ఎన్వోసీలు జారీని నిలిపివేశామని స్పష్టంచేశారు.