హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): తమిళనాడుకు చెందిన కార్డిలియా క్రూజ్‌ను పుదుచ్చేరిలోకి అనుమతించేందుకు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ నిరాకరించారు. విశాఖపట్నం నుంచి బయలుదేరి పుదుచ్చేరి తీరం సమీపంలోకి వచ్చిన ఆ ఓడ తెల్లవారుజామున 4 గంటల నుంచి సముద్రంలోనే నిలిచిపోయింది.
పుదుచ్చేరి అధికారులు క్రూజ్ గురించి తమకు సమాచారం లేదని అంటుండగా.. స్థానిక రాజకీయ పార్టీలు క్యాసినో, గ్యాంబ్లింగ్ అడ్డాగా ఉండే ఆ ఓడను అనుమతించొద్దని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం సీ టూరిజం అనే పైవేటు కంపెనీతో కలిసి ఈ లగ్జరీ క్రూజ్ టూర్‌ను ప్రారంభించింది. ఈక్రూజ్ లైనర్ చెన్నై నుంచి పాండిచ్చేరి, విశాఖపట్నం మధ్య ట్రిప్పులు వేస్తుంది.