సిద్దిపేట, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను ఐటీఐలతో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఏఐసీటీఈ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే, ఎస్బీటీఈటీ బోర్డు పర్యవేక్షణలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను యథాతథంగా కొనసాగించాలని స్పష్టంచేశారు.
పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి శాఖలోకి విలీనం చేసేలా మంత్రిమండలి ఆమోదించిన బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను ఐటీఐలతో కలుపాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సిద్దిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాజ్‌గోపాల్ పేట రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఆ మార్గంలో వెళ్తున్న హరీశ్‌రావు విద్యార్థుల ఆందోళనను గమనించి అకడ ఆగి వారికి సంఘీభావం తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్య ద్వారా ఎందరో నిరుపేద విద్యార్థులు నాణ్యమైన సాంకేతిక విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని చెప్పారు.
రాష్ట్రంలోని 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో సుమారు 95% మంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారేనని పేర్కొన్నారు. జీవో 97ను రద్దు చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి తాను లేఖ రాశానని, అసెంబ్లీలో కూడా విద్యార్థుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు కోసం అవసరమైతే మరింత పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. సిద్దిపేట ఉమెన్స్ పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్తోపాటు తమ విద్యార్థి విభాగం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ అంశంపై ప్రతి వేదికపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని భరోసా కల్పించారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యార్థుల గొంతు నొకుతుంటే రాహుల్‌గాంధీ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు..? పాలిటెక్నిక్ వ్యవస్థను ఐటీఐల్లో కలిపి డీగ్రేడ్ చేసే జీవో 97ను ప్రభుత్వం తక్షణమే వెనకి తీసుకోవాలి. రాహుల్‌గాంధీకి ఢిల్లీకో న్యాయం, తెలంగాణకో న్యాయమా..? సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పి జీవో 97ను రద్దు చేయించండి. మా ప్రభుత్వం కూలిపోతుందేమో.. నేను హామీ ఇవ్వలేను అనడం మంత్రి వివేక్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. జీవో 97 రద్దయ్యే వరకు పాలిటెక్నిక్ విద్యార్థులకు బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం’ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో కలసిన పాలిటెక్నిక్ విద్యార్థులకు మీ వెన్నంటే ఉంటాం.. ఆందోళన చెందకండి అంటూ భరోసా ఇచ్చారు.