Polytechnic College | మహబూబ్‌నగర్, జనవరి 4 : విద్యార్థినుల టాయిలెట్లో సెల్‌ఫోన్‌తో వీడియో రికార్డు చేసిన దారుణ ఘటన శనివారం మహబూబ్‌నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చోటుచేసుకున్నది. కళాశాల విద్యార్థినులు, డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి బ్యాక్లాగ్ పరీక్షలు రాసేందుకు వచ్చాడు. విద్యార్థినుల బాత్రూంలో సెల్‌ఫోన్ వీడియో ఉంచి రికార్డులో పెట్టాడు. విద్యార్థినులు బాత్రూంలోకి వెళ్లగా అక్కడ సెల్‌ఫోన్ కెమెరా ఆన్‌లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ ఫోన్‌ను కళాశాల ప్రిన్సిపాల్‌కు అప్పగించారు. ప్రిన్సిపాల్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి వివరాలను సేకరించారు.
విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి కళాశాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, కళాశాలల్లో విద్యార్థినులకు రక్షణ కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, వన్‌టౌన్ సీఐ అప్పయ్య, ఎస్సై శ్రీనయ్య విద్యార్థుల ఆందోళనను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో తన సెల్ ఫోన్ కనపడటం లేదని నిందితుడు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. సదరు విద్యార్థిని షీటీం వారు అదుపులోకి తీసుకొని విచారించి సెల్‌ఫోన్ అతడిదే అని తెలుసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు. కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి కళాశాలకు చేరుకొని విద్యార్థినుల టాయిలెట్లతోపాటు కళాశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థినుల రక్షణకు చర్యలు తీసుకోవాలని పోలీసులతోపాటు ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.