హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ కోర్సుల్లో సీట్లు మొత్తం మన రాష్ట్ర విద్యార్థులే దక్కించుకోనున్నారు. ఇది వరకు గల 15శాతం ఏపీ కోటా సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం కోత పెట్టింది. మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా జీవో జారీచేశారు. తొలుత 85శాతం సీట్లను మన రాష్ట్ర విద్యార్థులతో భర్తీచేస్తారు. మిగిలిన 15శాతం సీట్లను మన దగ్గర పదేండ్లు నివాసమున్నవారు, రాష్ట్రంలోని కేంద్రప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లలు, స్పౌజ్గా రాష్ర్టానికి వచ్చిన వారితో భర్తీచేస్తారు. మొత్తం సీట్లు మన రాష్ట్రం వారికే లభించనున్నాయి. డిప్లొమా/పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్-25 షెడ్యూల్ విడుదలయ్యింది.
పరీక్షను మే 13న నిర్వహిస్తారు. నేడు పాలిసెట్ నోటిఫికేషన్ విడుదలకానుండగా, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమవుతున్నది. ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 13న పరీక్ష నిర్వహించి, 12 రోజుల తర్వాత ఫలితాలు విడుదల చేస్తారు. నోటిఫికేషన్ ఆలస్యం కావడంతో మంగళవారం నమస్తే తెలంగాణలో ‘పాలిసెట్ ఉన్నట్టా.. లేనట్టా’ శీర్షికన కథనం ప్రచురితమయ్యింది. దీనిపై సాంకేతిక విద్యాశాఖ వర్గాలు ఆరా తీశాయి. నోటిఫికేషన్ను త్వరగా విడుదల చేయాలని ఆదేశాలివ్వగా బుధవారం నోటిఫికేషన్ విడుదలకు ముహుర్తం ఖరారుచేసి ప్రకటించారు.