నల్లగొండ : మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ సమయం ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్.. ఆ తర్వాత పుంజుకుంది. సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదైంది. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. మునుగోడు నియోజకవర్గంలో 2,41,805 ఓట్లు ఉండగా, ఇప్పటి వరకు 1,87,527 ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు.
చౌటుప్పల్, నారాయణపురంలో భారీగా పోలింగ్ నమోదైంది. అయితే పోలింగ్ సమయం ముగిసే సమయానికి క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించనున్నారు. పలు చోట్ల మరో గంట పాటు పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. ఓటేసేందుకు మహిళలు, వృద్ధులు, యువత బాగా ఆసక్తి చూపారు. మొత్తంగా మునుగోడులో భారీగా పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉంది.
టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ తరపున రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. వీరి భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఎన్నికల ఫలితాలు నవంబర్ 6వ తేదీన వెలువడనున్నాయి.