కృష్ణకాలనీ, జూన్ 17 : కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపుల పాలన సాగిస్తున్నదని వరంగల్ జడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని భాస్కర్‌గడ్డలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి 2023 అక్టోబర్‌లో తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం లబ్ధిదారులు స్థానిక అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. వీరి ఆందోళనకు మద్దతు ప్రకటించిన గండ్ర జ్యోతి రెండు గంటలపాటు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల కోసం భాస్కర్‌గడ్డలో 462 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి గత అక్టోబర్‌లో 392 మందిని గుర్తించి కలెక్టర్ సమక్షంలో డ్రా పద్ధతిలో వారికి కేటాయించినట్టు తెలిపారు. ఆ తరువాత ఎన్నికల కోడ్ రావడంతో ఇంటి పట్టాలు ఇవ్వలేదని, ఎన్నికలు ముగిశాక ఇస్తామని కలెక్టర్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రాగా, కొంతమంది అధికార పార్టీ నాయకులు అక్రమంగా ఇండ్లను తీసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆరు రోజులుగా పేదలు ధర్నాలు చేస్తుంటే ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో పట్టాల్వికపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గండ్ర జ్యోతి హెచ్చరించారు. ఆందోళనలో పాల్గొన్న లబ్ధిదారు తాటికొండ సమ్మక్క సీఐ నరేశ్‌కుమార్ కాళ్ల మీద పడి తన గోడు వెళ్లబోసుకున్నది. ‘సార్.. నాకు 30 ఏండ్లుగా ఇల్లు లేదు. కిరాయి ఇండ్లల్లో ఉంటున్న. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నా పేదరికాన్ని గుర్తించి డబుల్ బెడ్రూం ల్లు కేటాయించింది. నా ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టా ఇవ్వకుండా తీసేయాలని చూస్తున్నది. నాకు పట్టా ఇప్పించండి’ అంటూ సీఐ కాళ్ల మీద పడటం అక్కడున్న వారిని కలిచివేసింది.