హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్యాంగ పదవిలో ఉండి రాజకీయాలు చేస్తున్నారని, ఆమె రాజకీయాలు చేయాలనుకుంటే పూర్తిస్థాయిలో రాజకీయనేతగా ఉండాలని, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పదవిని వదిలివేయాలని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పాదయాత్రను విమర్శిస్తూ తమిళిసై వ్యాఖ్యలు చేయడం సరికాదని, రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి రాజకీయ వ్యాఖ్యలు చేయడమేంటని నిలదీశారు. ఇదిలా ఉండగా తమిళనాడులోని అధికార డీఎంకే కూడా తమిళిసై సౌందర్‌రాజన్ తీరుపై మండిపడింది. రాజకీయాల్లో జోక్యం తగ్గించుకొని గవర్నర్‌గా, లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా తనపని తాను చేసుకుంటే మంచిదని పేర్కొంటూ డీఎంకే పత్రిక మురసోలిలో ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించారు.