Kodangal Big Brother | ప్రభుత్వంలోని ఓ కీలక విభాగంలో రూ.9 కోట్ల విలువైన పనికి సంబంధించి ఇటీవల ఓ కాంట్రాక్టర్ టెండర్ వేశారు. అన్ని అర్హతలూ కలిగి ఉండి, అన్ని నియమ నిబంధనలకు లోబడి ఆయన దరఖాస్తు చేసుకున్నారు. గత ఎన్నికల్లో సదరు కాంట్రాక్టర్ వ్యక్తిగతంగా తనకు, కాంగ్రెస్ పార్టీకి బాగా సహకరించారని, పైగా ఆయనకు అన్ని అర్హతలూ ఉన్నాయి కాబట్టి సహజంగా ఆ టెండర్ ఆయనకే వస్తుందని, అడ్డుకోవద్దని దక్షిణ తెలంగాణకు చెందిన ఓ సీనియర్ మంత్రి సదరు పనికి సంబంధించిన సీఈకి ఫోన్ చేసి చెప్పారు. ఆ సీఈ ఏమాత్రం మొహమాటం లేకుండా, తనతో మాట్లాడుతున్నది మంత్రి అని తెలిసికూడా, ఆ అభ్యర్థనను తిరస్కరించారు. ‘సర్.. ఈ పనిని ఫలానా వ్యక్తికి ఇవ్వుమని ముఖ్యనేత సోదరుడు ముందే చెప్పారు. నేను ఆయన మాట ఎట్లా కాదనగలను?’ అని సదరు సీఈ జవాబిచ్చారట! దీంతో అవాక్కవడం ఆ మంత్రి వంతైంది. ఒక్క ఆ మంత్రికే కాదు.. ఇప్పుడు క్యాబినెట్‌లోని పలువురు సీనియర్ మంత్రులకు సీఈ, ఎండీల తదితర కింది స్థాయి అధికారుల నుంచి నేరుగా ఇలాంటి జవాబులే అందుతున్నాయట! దీంతో ఆ మంత్రులు మింగలేక, కక్కలేక నిస్సహాయ స్థితిలోకి చేరుకుంటున్నారు. ఒకరిద్దరయితే ‘నేను మంత్రిని చెప్తుంటే నువ్వు ఇంకెవడి పేరో చెప్తావేందయ్యా?’ అని అధికారులను గద్దిస్తున్నా, కింది స్థాయి అధికారులు పెద్దగా లెక్క చేయడం లేదని తెలిసింది. ఇంతకూ ఎవరా సోదరుడు?
హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ‘ముఖ్యనేత’ పీఠంపై కూర్చున్నారు. ఆయనకు ఐదుగురు సోదరులు. వాళ్లెవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. చట్ట సభల్లో సభ్యులు కూడా కాదు. పోనీ ఐఏఎస్‌లో, ఐపీఎస్‌లో కాదు. చివరికి సర్కార్ కొలువు చేస్తున్నవారు కూడా కాదు. అయినా వాళ్లు ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారు. ‘బిగ్ బ్రదర్స్’ పేరుతో దర్జాగా అధికారం చెలాయిస్తున్నారు. వాళ్లు ఫోన్ చేస్తే నేరుగా ‘ముఖ్యనేత’ మాట్లాడినట్టే! వాళ్లు కన్నెర్ర జేస్తే ‘ముఖ్యనేత’ మూడో కన్ను తెరిచినట్టే! వారి మాటే శాసనం! చెప్పిందే వేదం! టెండర్ ఏదైనా వాళ్లు కన్ను గీటితేనే దక్కుతుంది. కాంట్రాక్టులు, కాంట్రవర్సీలు.. ఇలా ఫైలు ఏదైనా వాళ్లు ‘ఎస్’ అంటే రబ్బర్ స్టాంపు పడిపోతుంది. ఇందులో అందరి కంటే ‘పెద్దోడి’ రూటే సప‘రేటు’. తమ్ముడి శాఖల్లో మాత్రమే కాదు.. ఇతర మంత్రుల శాఖల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. హైడ్రా కూల్చివేతలు, సింగరేణి టెండర్లు, కాంట్రాక్టులు ఇలా అన్నీ ఆయన చెప్పినట్టే జరుగాలట! ఫోన్లో ఆయన బూతుల వర్షం కురిపిస్తారని, ‘పెద్దోడి’ పేరు చెప్తే అధికారులే గడగడలాడిపోతున్నారని ప్రచారం జరుగుతున్నది.
కొడంగల్‌కు ఎమ్మెల్యే ఉన్నా, అక్కడ రాజకీయం చేసేది ‘పెద్దోడే’ అనేది బహిరంగ రహస్యం. ఆ నియోజకవర్గానికి మకుటం లేని మహారాజుగా ప్రకటించుకున్నారని కాంగ్రెస్ శ్రేణులే పేర్కొంటున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో అధికారిక కార్యక్రమం నిర్వహిస్తే ఆయనకు కలెక్టర్‌తో సమానమైన కుర్చీ వేయాల్సిందేనని, క్యాబినెట్ స్థాయి భద్రత కల్పించాల్సిందేనని స్థానిక అధికారులు చెప్తున్నారు. నియోజకవర్గంలో ఏ చిన్న పని జరుగాలన్నా, ఏ అధికారి బదిలీ కావాలన్నా ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సిందేనని ప్రచారం జరుగుతున్నది. అధికారులతో సమీక్షలు నిర్వహించడం, టెండర్లను ప్రభావితం చేయడం వంటి ఆరోపణలున్నాయి. ఆయన ఫోన్ చేస్తే ఎలాంటి పనైనా కావాల్సిందేనని చెప్పుకొంటున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే పరిస్థితి ఉన్నదని, నియామకాలన్నీ ఆయన చెప్పినట్టే జరుగుతున్నాయని ప్రచారంలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వంలోకి రాజ్యాంగేతర శక్తిగా దూరిన ఆయన.. కంటిచూపుతోనే వ్యవస్థలను శాసిస్తున్నారనే విమర్శలున్నాయి. తన సోదరుడి వద్ద ఉన్న కీలక శాఖల్లో మాత్రమే కాకుండా ఇతర మంత్రుల శాఖల్లోనూ జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ శాఖలపై ‘పెద్దోడి’ పెత్తనం మీద మంత్రులు అనేకసార్లు ముఖ్యనేతకు ఫిర్యాదు చేసినట్టు సచివాలయ వర్గాలు తెలిపాయి.
పెద్దోడు ప్రభుత్వ శాఖల్లోని సీఈ, ఎండీ, తదిరత కీలక స్థాయి అధికారులను, జిల్లాల్లో కలెక్టర్లు, ఆర్డీవోలు వంటి అధికారులను గుప్పిట్లో పెట్టుకొని, భయపెట్టి పనులు చేయించుకొంటున్నారనే ప్రచారం జరుగుతున్నది. మంత్రులు చెప్తే అధికారులు ఆలోచిస్తారేమోగానీ, ‘పెద్డోడు’ చెప్తే మాత్రం క్షణాల మీద చేసి పెడుతున్నారని చెప్తున్నారు. రూ.కోటి మొదలు రూ.100 కోట్ల వరకు ఎలాంటి ఫైల్ అయినా తీసుకుంటారనే ప్రచారం జరుగుతున్నది. ఫ్యూచర్ సిటీ, ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ వంటి ప్రభుత్వ నిర్ణయాలతోపాటు, ఆదిబట్ల సీలింగ్ భూముల వ్యవహారం నుంచి మొదలుపెట్టి తాజాగా బయటికి వచ్చిన మంచిరేవుల భూ కుంభకోణం వరకు ‘పెద్దోడి’ కనుసన్నల్లోనే జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల అత్యంత వివాదాస్పదమైన నాదర్గుల్ భూ వివాదంలో బాధిత రైతులు తనను కలువాలంటూ పెద్దోడు హుకుం జారీచేశాడని, పోలీసులు, బ్రోకర్లతో వర్తమానం పంపుతున్నాడని సమాచారం. ఇప్పుడు భూమాత పోర్టల్‌లో తాజాగా నిషేధిత జాబితాలో చేర్చిన వందల ఎకరాల భూములను టార్గెట్ చేసి, సెటిల్మెంట్ చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో ఎల్ఏజీ నంబర్లతో నిషేధిత జాబితాలో ఉన్న భూములను గుర్తించి, రైతులతో సెటిల్మెంట్ చేసుకొని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో హైరైజ్ భవనాల నిర్మాణం ఈ ప్రాంతంలోనే ఎక్కువగా జరుగుతున్నది.
మూసాపేటలోని సర్వే నంబర్ 210లో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంలో పెద్దోడు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తున్నది. 1970 నుంచి వివాదంలో ఉన్న భూములను గంపగుత్తగా ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇప్పించినట్టు సమాచారం. ఈ భూమిలో అధికారికంగా 1,200 ఫ్లాట్లు, అనధికారంగా మరో 600 ఫ్లాట్లు మొత్తం కలిపి 1,800 ఫ్లాట్ల నిర్మాణం జరుగుతున్నదని చెప్తున్నారు. ఈ వ్యవహారంలో వారికి రూ.వందల కోట్లు ముట్టినట్టు ప్రచారంలో ఉన్నది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండీఏ, కాంట్రాక్టు పెండింగ్ బిల్లులు తదితర వ్యవహారాలు పెద్దోడికే అప్పగించినట్టు సమాచారం. హైడ్రాను వసూళ్ల సాధనంగా మార్చుకున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. చెరువుల ఆక్రమణల సాకుతో రియల్టర్లను భయపెట్టి, ఇండ్లు కూల్చకుండా ఉండాలంటే కోట్లాది రూపాయలు సమర్పించుకోవాలని డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. బహుళ అంతస్తుల భవనాల అనుమతులు, టెండర్ల ప్రక్రియలో మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు చెప్పుకొంటున్నారు. ఐఅండ్ పీఆర్ శాఖలో వాణిజ్య ప్రకటనలు తదితర వ్యవహారాలు కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయని సమాచారం. అంతేకాదు, హైదరాబాద్ నగరం అంతటా అడ్వైర్టెజ్‌మెంట్ కాంట్రాక్టులు, ఫ్లెక్సీల అనుమతులు ఆయన ప్రమేయంతోనే జరుగుతున్నాయని చెప్తున్నారు. సింగరేణి గనులకు సంబంధించి ఏడు గనుల టెండర్లలో పెద్దోడే చక్రం తిప్పారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో రహస్య స్నేహం చేసే ఒక జాతీయ పార్టీకి చెందిన నేత పెద్దోడికి భూ దందాల్లో సహకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఖైరతాబాద్ నుంచి గచ్చిబౌలి ఏరియా వరకు వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారని సమాచారం. ఇటీవల గచ్చిబౌలి సర్వే నంబర్ 41లోని రెండు వేల గజాలకు సంబంధించిన ఒక భూ వివాదం కేసులో ఓ పోలీస్ ఉన్నతాధికారి పెద్దోడి అనుచరుడిని అదుపులోకి తీసుకున్నారట. ఈ విషయం తెలిసి పెద్దోడు సదరు ఉన్నతాధికారికి ఫోన్ చేశాడని, ‘నా అనుచరుడినే అరెస్ట్ చేస్తావా?’ అంటూ విరుచుకుపడ్డారని సమాచారం. దీంతో సదరు పోలీసు అధికారి కూడా దీటుగానే బదులిచ్చినట్టు తెలిసింది. ఇతర శాఖల్లోనూ తనకు అనుకూలంగా పని చేయని అధికారులకు కూడా ఫోన్లు చేసి బూతులు తిడుతున్నారని చెప్పుకొంటున్నారు. పెద్దోడి వ్యవహార శైలిపై అటు మంత్రులు, ఇటు అధికారులు తీవ్ర అసహనంతో ఉన్నారు.
కొంత మంది సివిల్ సర్వెంట్ స్థాయి అధికారులు సైతం పెద్దోడి అడుగులకు మడుగులొత్తుతూ ‘జీ హుజూర్’ అంటున్నారని, అందుకే ఆయన మరింత రెచ్చిపోతున్నారని పలువురు కిందిస్థాయి అధికారులు వాపోతున్నారు. ఇలాంటి అనధికారిక, అనైతిక, అక్రమ కార్యకలాపాలను అరికట్టాల్సినవారే మంత్రులను పక్కకు పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు దాసోహం అనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల మొత్తం వ్యవస్థే నిర్వీర్యం అవుతున్నదని, తమలాంటి వాళ్లకు రక్షణ లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదంతా సీఎంకు తెలిసే జరుగుతున్నదా? ఆయన ఇలాంటి వాటిని ఎలా అనుమతిస్తున్నారు? అని అధికారులు చర్చించుకుంటున్నారు. ఐఏఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు మంత్రుల ఆదేశాలను పట్టించుకోకుండా, ప్రైవేట్ వ్యక్తులు చెప్పినట్టుగా పనిచేస్తుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేని, ఏ అధికారిక హోదాలేని వ్యక్తులు నేరుగా ఫోన్లు చేసి హెచ్వోడీలకు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తుంటే సీఎస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలను అడ్డుకొని, కాంపిటెంట్ అథారిటీ నుంచి మాత్రమే ఆదేశాలు తీసుకోవాలని చెప్పే నైతిక బాధ్యత ఆయనకు లేదా? అని మంత్రులే ప్రశ్నిస్తున్నారు. ఒక వ్యక్తి దుందుడుకుతనం వల్ల రాష్ట్రంలో మొత్తం పాలనా యంత్రాంగమే భయపడే స్థితికి చేరుకున్నదని, దీని వల్ల భవిష్యత్తులో ఏవైనా విపరిణామాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని సదరు మంత్రులు అడుగుతున్నారు. తమ శాఖలపై ఎవరో వచ్చి పెత్తనం చెలాయించడం వల్ల తలెత్తే పర్యవసానాలకు రేపు ఎవరు బాధ్యత వహించాలి? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కళ్లెం తెగిన గుర్రంలా మారిన యంత్రాంగాన్ని ఎలా కట్టడి చేయగలమని వాపోతున్నారు.