హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కంటెంట్‌కు ప్రీ-మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో ఎంసీఎంసీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ చైర్మన్‌గా అడిషనల్ చీఫ్ ఎలక్ట్టోరల్ ఆఫీసర్ చైర్మన్ వ్యవహరిస్తారు. సభ్యులుగా హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్, ఆల్ ఇండియా రేడియా డిప్యూటీ డైరెక్టర్, ఐటీ శాఖకు చెందిన డిజిటల్ మీడియా వింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, మెంబర్ కన్వీనర్‌గా అసిస్ట్టెంట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఉంటారు.
రాజకీయ పార్టీలు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, కేబుల్ నెట్‌వర్క్‌లు, ఎఫ్ఎం చానల్స్, సినిమా థియేటర్లు, రేడియో, బల్క్ ఎస్ఎంఎస్లు, వాయిస్ మెసేజ్‌లు, ఈ-న్యూస్ పేపర్లు, సోషల్‌మీడియా, వెబ్సైట్లు, బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, తదితర ప్రదేశాల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ప్రచారానికి సంబంధించిన వీడియో, కంటెంట్‌పై ఈ కమిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్ల్లో పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కూడా డిస్ట్రిక్ట్ లెవల్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో జిల్లా ఎన్నికల అధికారి లేదా పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఏఆర్వో, సోషల్ మీడియా ఎక్స్పర్ట్, కేంద్ర సమాచార ప్రసారశాఖ అధికారి, ప్రెస్‌కౌన్సిల్ ప్రతిపాదించిన జర్నలిస్ట్ సభ్యులగా, డీపీఆర్వో మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు.