హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తేతెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి మెప్పు కోసం కేసీఆర్ పాలనపై రాజకీయ విమర్శలు చేసిన విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి.. తన పేరును ఎనుముల మురళిగా మార్చుకుంటే బెటర్ అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఐఏఎస్‌గా పనిచేసిన ఆయన ఆలోచనా వి ధానం ఆ హోదాకు తగ్గట్టులేకపోవడం విచారకరమని శనివారం ఎక్స్ వేదికగా దెప్పిపొడిచారు. దశాబ్దాల తెలంగాణ చరిత్రలో విద్యారంగాన్ని స్వర్ణయుగంగా మార్చిన కేసీఆర్‌ను ఉద్దేశించి పదేండ్లలో విద్యాశాఖపై సమీక్ష చేయలేదని, కేసీఆర్ కంటే రేవంత్ పా లన వెయ్యిరెట్లు నయమని చెప్పడం ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా గురుకులాలు, 75 కొత్త డిగ్రీ కాలేజీలు, ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ, మహిళా వర్సిటీ, ఫారెస్ట్ కాలేజీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, మన ఊరు-మన బడి, మా ర్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్‌లన్నీ కేసీఆర్ రివ్యూ చేయకుండానే గాల్లో నుంచి ఊడిపడ్డాయా..? అని ప్రశించారు. విద్యా కమిషన్ చైర్మన్ పేరిట కళ్లు మూసుకొని అబద్ధాలు చెబితే జనం నమ్మరు అని చురకలంటించారు. రిసెర్చ్ అండ్ డ్రాఫ్టింగ్ కమిటీ అని గొప్పగా ప్రకటించుకోవ డం తప్ప ఉద్ధరించిందేమీ లేదని ధ్వజమెత్తారు.
కేసీఆర్ పాలనలో ప్రభుత్వ స్కూళ్లలో 48శాతం ఉన్న విద్యార్థుల నమోదు.. రేవంత్ పాలనలో 34 శాతానికి పడిపోయింది నిజంకాదా..? ప్రైవేట్ స్కూళ్లలో 52శాతం నుంచి 66కు పెరిగింది వాస్తవం కాదా? రేవంత్‌రెడ్డి ప్రభుత్వ విద్యను భ్రష్టుపట్టిస్తున్నారనేందుకు ఈ గణంకాలు చాలవా..?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గురుకులాల్లో 130 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే ఎందుకు పట్టించుకోలేదు? అని నిలదీశారు. రాజకీయాలు చేయాలని ముచ్చటపడుతున్న మురళి.. కమిషన్ చైర్మన్ కుర్చీ దిగి గాంధీభవన్‌కు వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని ఎద్దేవా చేశారు.