హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలని పోలీసుల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఆకాశ్, శంకర్, కల్యాణ్ డిమాండ్ చేశారు. 2016, 2018, 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం 15 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పోలీసు ఉద్యోగమూ ఇవ్వలేదని మండిపడ్డారు.
వెంటనే పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చిన కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా ఉన్న ఏపీకి చెందిన పీవీ శ్రీనివాసరావును వెంటనే తొలగించాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు.