హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇన్నాళ్లూ కాంగ్రెస్ నేతల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన పోలీసు ఉద్యోగార్థులు.. ప్రభుత్వంపై పోరాటానికి ఈ నెల 15న కార్యాచరణ ప్రకటించనున్నారు. తక్షణం 20వేలతో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో ఐక్య కార్యాచరణ రూపొందించుకున్నారు. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల కోసం తక్షణం నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో పోలీసు నోటిఫికేషన్ కోసం సుమారు 10 లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. జిల్లాల్లోని ఉద్యోగార్థులతో కలిసి పోరాటాలకు ‘సై’ అంటున్నారు. కేసీఆర్ హయాంలో 2022లో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాగా.. మళ్లీ ఇప్పటివరకూ అతీగతి లేదు. కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే పోలీసు నోటిఫికేషన్ మూడుసార్లు వాయిదా పడిందని, అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌కు దిక్కులేదని చెప్తూ నిరుద్యోగులను కార్యోణ్ముఖులను చేస్తున్నారు.
పోలీసు ఉద్యోగాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు, నోటిఫికేషన్ విడుదల చేయించేందుకు పోలీసు నిరుద్యోగ జేఏసీ ఈ నెల 15న తమ కార్యాచరణను ప్రకటించనున్నది. తక్షణం 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని, జీవో 46ను టీజీఎస్పీ విభాగం నుంచి తొలగించాలని, కానిస్టేబుల్ అభ్యర్థుల వయసును 35 ఏండ్లకు పెంచాలనే ప్రధాన డిమాండ్లపై కార్యాచరణను రూపొందించనున్నది.