Namaste Telangana | హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఒకే నంబర్… కానీ ఒక ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటూ ఉంది… మరో దానిలో పేరు ఉంది… మొదట గుర్తు తెలియని వ్యక్తులు అని ఉన్న ఎఫ్ఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు! ఇదేం ఘోరం అంటూ ‘నమస్తే తెలంగాణ’ కథనంలో ప్రశ్నించడంతో వెంటనే పాత ఎఫ్ఐఆర్ తొలగించి, ప్రవీణ్‌రెడ్డి పేరు ఉన్న ఎఫ్ఐఆర్ను అప్లోడ్ చేశారు!! చూశారా… ఎఫ్ఐఆర్లో పేరు ఉన్నప్పటికీ ‘నమస్తే’ కథనంలో మాత్రం అదృశ్య శక్తి ఒత్తిడితో పేరు లేకుండా చేశారనే దుష్ప్రచారం చేస్తున్నదంటూ పోలీసు శాఖ పత్రికా ప్రకటననే విడుదల చేసింది. కాంగ్రెస్ నేత కూడా అందుకు వత్తాసు పలుకుతూ ‘నమస్తే తెలంగాణ’పై అవాకులు చెవాకులు పేలారు.
సీన్ కట్ చేస్తే..
ఒకే నంబరుపై ఉన్న రెండు ఎఫ్ఐఆర్ల గుట్టు రట్టయింది. ఎవరు గుర్తిస్తారులే! అనుకుని పోలీసులు తొలగించిన పాత ఎఫ్ఐఆర్ కాపీ ‘నమస్తే తెలంగాణ’లో సోమవారం ప్రత్యక్షమైంది. ప్రవీణ్‌రెడ్డి పేరు ఉంది సరే! మరి పాత దానిలో ‘గుర్తుతెలియని వ్యక్తులు’ అని ఉండటం వెనుక ఆంతర్యమేంటని ‘నమస్తే’ నిలదీసింది. దీంతో పోలీసు శాఖ కంగుతిన్నది. ఒకే నంబరుపై రెండు ఎఫ్‌ఐఆర్‌లా? అని అందరూ ముక్కున వేలేసుకున్నారు. దీంతో రాచకొండ పోలీసులు సోమవారం ఈ పరిణామంపై తీవ్రస్థాయిలో తర్జనభర్జన పడ్డారు.
ఎఫ్ఐఆర్ కాపీ బయటకెలా వెళ్లింది?
బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. నాదర్గుల్లోని సర్వేనంబరు 92లోని సుమారు 300 ఎకరాల భూమిపై జరుగుతున్న అనధికారిక ఒప్పందాల వ్యవహారంపై రెవెన్యూశాఖ కంటే ఇప్పుడు పోలీసు శాఖనే పూర్తిస్థాయి దృష్టి సారించింది. ఈ క్రమంలో అక్టోబర్ 31న బాలాపూర్ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రవీణ్‌రెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో పెట్టలేదని ‘నమస్తే తెలంగాణ’ ప్రశ్నించటంతో 2 రోజుల కిందట రాచకొండ పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎఫ్ఐఆర్లో ప్రవీణ్‌రెడ్డి పేరు చేర్చినప్పటికీ తప్పుడు కథనాలు రాశారని, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సోమవారం ‘నమస్తే’ పూర్తి ఆధారాలతో 2 ఎఫ్ఐఆర్ల గుట్టు విప్పింది. గుర్తు తెలియని వ్యక్తులుగా ఉన్న ఎఫ్ఐఆర్, ప్రవీణ్‌రెడ్డి పేరుతో ఉన్న ఎఫ్ఐఆర్ను బయటి ప్రపంచానికి చూపింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు.
గుర్తుతెలియని వ్యక్తులు అని ఉన్న ఎఫ్ఐఆర్ కాపీ ‘నమస్తే’ చేతికి ఎలా వెళ్లింది? అంటూ సోమవారం ఉదయం పోలీసులు ఆరా తీశారు. పోలీసు అధికారులతో రాచకొండ సీపీ సుధీర్‌బాబు సమాలోచనలు చేసినట్టు తెలిసింది. సోమవారం రాత్రి కూడా టీఎస్పోలీస్ వెబ్‌సైట్‌లోని ఎఫ్ఐఆర్లో గుర్తుతెలియని వ్యక్తులు అని పేర్కొన్న ఎఫ్ఐఆర్ ఉంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అందులో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే న్యాయస్థానం ద్వారా అనుమతి పొంది మాత్రమే చేయాల్సి ఉంటుందని రిటైర్డ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కానీ ఇప్పుడు పోలీసులు ఇష్టానుసారంగా మార్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా ఆన్లైన్లో ఇప్పటికీ గుర్తుతెలియని వ్యక్తులు అని రాసిన ఎఫ్ఐఆర్ ఉండగా… ఆదివారం పరోక్షంగా పోలీసులు, కాంగ్రెస్ పార్టీ సర్క్యులేట్ చేసిన ఎఫ్ఐఆర్లో ప్రవీణ్‌రెడ్డి పేరు ఉంది. అంతేగాకుండా రాచకొండ పోలీసులు అధికారికంగా ఇచ్చిన పత్రికా ప్రకటనలోనూ ఎఫ్ఐఆర్లో ప్రవీణ్‌రెడ్డి పేరు ఉన్నట్టుగా స్పష్టం చేశారు.
తొలుత కేసు… ఇప్పుడు నిఘా
మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూమి కార్పోరేట్ పరం కాకుండా ‘నమస్తే తెలంగాణ’ కథనం రాసి అధికారులను అప్రమత్తం చేసింది. రైతులు తాత్కాలిక ప్రయోజనాల కోసం భూములను కోల్పోకుండా జాగ్రత్తలు సూచించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు బాధ్యతాయుతంగా ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఆ భూముల్లో ఎలాంటి కదలికలు ఉన్నాయో పరిశీలించుకుని ఆ భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకున్నారు. కానీ పోలీసులు మాత్రం ఓ రైతు ఇచ్చిన ఫిర్యాదును ఆసరాగా చేసుకుని, అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన ప్రభుత్వ భూమిని అమ్ముకుని ఆర్థికంగా ప్రయోజనం పొందాలనుకుంటే ‘నమస్తే’ కథనంతో నష్టపోయానని సదరు రైతు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంటే చట్టప్రకారం లావణి పట్టా భూముల క్రయవిక్రయాలు నిషేధం. అది పోలీసులకు కూడా తెలుసు. కానీ రైతు అమాయకంగా నిబంధనలకు విరుద్ధమైన అంశాన్ని అందులో పేర్కొంటే… దాని ఆధారంగా కేసు నమోదు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కాగా తొలుత కేసుతో ‘నమస్తే’ తెలంగాణను పరోక్షంగా బెదిరించిన పోలీసు శాఖ… తాజాగా రిపోర్టర్లపై తీవ్రస్థాయిలో నిఘా పెట్టినట్లు తెలిసింది.