Dudyala | కొడంగల్, నవంబర్ 28: లగచర్ల ఘటనతో ఇంటాబయట పరువు పోగొట్టుకున్న ప్రభుత్వం అప్రమత్తమైంది. లగచర్ల ఫార్మాపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై రైతులు దాడి ఘటనను ముందుగా పసిగట్టలేకపోవడం నిఘా వైఫల్యమేనన్న విమర్శలు వెల్లువెత్తాయి.
లగచర్ల ఘటన అనంతరం అరెస్టులు, పోలీసుల మోహరింపులతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నది. ఈ నేపథ్యంలో ఇకపై ఇటువంటి ఘటనలు జరిగితే వెంటనే అదుపుచేసేందుకు దుద్యాలలో పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీచేసింది.
బొంరాస్పేట పరిధిలోని దుద్యాల గ్రామాన్ని 21 గ్రామ పంచాయతీలతో కలిపి గత ప్రభుత్వం కొత్త మండలాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఇప్పటి వరకు బొంరాస్పేట మండల పరిధిలోనే పోలీస్ స్టేషన్ కొనసాగేది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడు దుద్యాల మండలానికి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానుంది.
ఈ మండల పరిధిలో దుద్యాల, లగచర్ల, ఈర్లపల్లి, గౌరారం, చిల్ముల్మైల్వార్, నాస్కాన్పల్లి, హంసాన్పల్లి, హకీంపేట, పోలెపల్లి, కుదురుమల్ల, ఆలేడ్తోపాటు హుస్నాబాద్ గ్రామాలతో కొత్తగా దుద్యాల పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానున్నట్టు తెలిసింది.