హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హోంశాఖలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 718 మందికి పోలీస్ సేవా పతకాలను శుక్రవారం ప్రకటించారు. సివిల్ పోలీస్, ఏసీబీ, విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్, టీఎస్ఎస్పీ, అగ్నిమాపకశాఖల్లో అత్యత్తుమ సేవలందించిన 18 మందికి‘తెలంగాణ రాష్ట్ర శౌర్య పతకం’ అందించనున్నారు. వీరిలో 11 మంది పోలీస్, ఏడుగురు అగ్నిమాపకశాఖ సిబ్బంది ఉన్నారు. ఈ 18 మందికి 10 వేల నగదు ప్రోత్సాహకం దక్కడమే కాక వేతనంలో రూ.500 ఇంక్రిమెంట్ ఉంటుంది. ‘తెలంగాణ రాష్ట్ర మహోన్నత సేవా పతకా’నికి ఎంపికైన 18 మందికి 40 వేల నగదు ప్రోత్సాహకం అందించనున్నారు. ‘ఉత్తమ సేవా పతకా’నికి అర్హత పొందిన 105 మందికి 30 వేల నగదు ప్రోత్సాహకం అందజేస్తారు. ‘కఠిన సేవా పతకం’ అందుకోనున్న 51 మందికి 20 వేల నగదు పురస్కారం అందజేస్తారు. ‘సేవా పతకా’నికి ఎంపికైన 526 మందిని 20 వేల నగదు ప్రోత్సాహకంతో సన్మానించనున్నారు.