హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఐబొమ్మ పేరుతో సిని మా పైరసీ, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు నిర్వహిస్తున్న ఇమ్మడి రవి దేశ డిజిటల్ భద్రతకు హానికరమని పోలీసులు పేర్కొన్నారు. రవి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పొందుపరిచారు. ఐబొమ్మ, బప్పం పేరుమీద రవి మొత్తం 17 వెబ్సైట్లు తయారుచేసి, నిర్వహించినట్టు వెల్లడించారు. ఐబొ మ్మ పేరుతో ఐబొమ్మ.పీయూ, ఐబొమ్మ. నెక్సస్, ఐబొమ్మ.మార్కెట్, ఐబొమ్మ.వన్ ఉ న్నాయని చెప్పారు. బప్పం పేరుమీద బప్పం. టీవీ, బప్పం.సీసీ, బప్పం.కో.ఇన్, బప్పం. నెట్, బప్పం.ఆర్గ్, బప్పం.ఈయూ వంటి వెబ్సైట్లను తయారు చేశాడని తెలిపారు. ఈ వెబ్సైట్లకు, బెట్టింగ్ సైట్లకు మధ్య కొన్ని ట్రా ఫిక్ డొమైన్లు ఏర్పాటు చేసుకున్నాడన్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకుగాను క్రిప్టో కరెన్సీ వాలెట్ల నుంచి రవి బ్యాంకు ఖాతాకు పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయని చెప్పారు. రవి తయారుచేసిన ట్రేడర్స్.ఇన్. కామ్, మేక్ఇండియాషాప్.షాప్ అనే రెండు డొమైన్లలో ఒకదాన్ని అమెరికాలో, ఇంకొకటి అమీర్‌పేటలో రిజిస్ట్రేషన్ చేయించాడని తెలిపారు. ఈ రెండు డొమైన్లే రవిని పట్టించాయని తెలిపారు. రవి బెదిరింపులకు పాల్పడిన స్టేట్మెంట్లు కూడా పోలీసులు రిమాండ్ రిపోర్టులో చేర్చారు. ఐబొమ్మ సైట్ వెనకాల ఉన్నది ఇమ్మడి రవినే అని పోలీసులు సాంకేతికంగా సాక్ష్యాలను సేకరించారు. పైరసీ చేసినట్టు ఇమ్మడి రవి అంగీకరిస్తూ, తాను ఏ విధంగా పైరసీ వెబ్సైట్లు నడిపాడో పోలీసులకు వివరించాడు.
ఇమ్మడి రవి కేసును హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే, అతడి చుట్టూ మరో ఉచ్చు బిగుసుకుంటున్నది. ఐబొమ్మ కేసులో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. కేసు వివరాలివ్వాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఈడీ లేఖ రాసింది. ఐబొమ్మ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తున్నది. రవి బ్యాంకు ఖాతాలోని రూ.3.5 కోట్లు ఫ్రీజ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ నుంచి రవికి నిధులు అందినట్టు దర్యాప్తులో తేలింది. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో రవి ఎన్ఆర్ఈ ఖాతాకు నిధులు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. క్రిప్టోవాలెట్ నుంచి రవి ఎన్నారై ఖాతాకు నెలకు రూ.15 లక్షలు బదిలీ అయ్యాయని తేల్చారు.
నాంపల్లి క్రిమినల్ కోర్టులు, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఇమ్మడి రవిని ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరుతూ మంగళవారం సైబర్ క్రైమ్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితుడికి నోటీసులు జారీచేసిన అనంతరం 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట పిటీషన్ సమర్పించారు. నకిలీ పాన్‌కార్డు, క్రిప్టో మనీలాండరింగ్, బెదిరింపు ఈ-మెయిల్స్, విదేశీ పౌరసత్వానికి సంబంధించిన కీలక ఆధారాలను జప్తు చేసినట్టు తెలిపారు. నిందితుడి పైరసీ వెబ్సైట్లకు 37 లక్షలకు పైగా వీక్షకులున్నట్టు గుర్తించారు. పెద్ద సంఖ్యలో యూజర్లు ఒన్-విన్, ఒన్-ఎక్స్‌బెట్ వంటి అక్రమ బెట్టింగ్ సైట్లకు అలవాటుపడి అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు పేర్కొన్నారు.
కొంతమంది యూజర్లు ఆత్మహత్య కూడా చేసుకున్నట్టు బయటపడిందన్నారు. ప్రహ్లాదకుమార్ వెల్లాల పేరిట నకిలీ పాన్‌కార్డు వాడుతూ, క్రిప్టో నుంచి వచ్చిన డబ్బును భారత కరెన్సీగా మా ర్చినట్టు గుర్తించామని తెలిపారు. క్లౌడ్ డా టాను డిలీట్ చేయడం, వెబ్సైట్లను, హోస్టింగ్ క్రెడెన్షియల్స్లను నిందితుడు తొలగించే ప్రమాదం ఉండటంతో పోలీసు కస్టడీలో విచారణ చేపట్టాల్సిన అత్యవసరం ఉందని పోలీసులు పిటీషన్లో పేర్కొన్నారు. విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
ఇమ్మడి రవి కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఐబొమ్మ సైట్లో బెట్టింగ్ యాప్ ప్రకటనలు ప్రదర్శిస్తూ రూ.కోట్లు ఆర్జించాడని తేలింది. ముఖ్యంగా వన్‌ఎక్స్‌బెట్, వన్విన్బెట్టింగ్ యాప్‌ల ద్వారా రవికి భారీగా డబ్బు సమకూరిందని పోలీసులు తెలిపారు. అతడి నాలుగు ఖాతాల్లో రూ.20 కోట్ల లావాదేవీలను గుర్తించారు. బెట్టింగ్ యాప్ ప్రకటనల ద్వారా వచ్చిన డబ్బుతో హైదరాబాద్, కరేబియన్ దీవుల్లో ఇండ్లు కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. ట్రావెలింగ్, విలాస జీవితం అనుభవించడమే అలవాటుగా చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
బెట్టింగ్ యాప్ డబ్బుల ద్వారా రెండునెలలకో దేశం తిరిగాడని చెప్పారు. సినిమాల పైరసీల ద్వారా నెలకు రూ.11 నుంచి రూ.15 లక్షలు సంపాదించాడని గుర్తించారు. స్నేహితులు, బంధువులతో ఎలాంటి సంబంధం లేకుండా జీవితం గడిపానని రవి పోలీసులకు చెప్పాడు. టెలిగ్రామ్ డాటా, మొబైల్ డాటా క్లియర్ చేసి ల్యాప్‌టాప్‌ను బాత్రూమ్ రూఫ్ కింద, సెల్‌ఫోన్‌ను అల్మారాలో పెట్టినట్టు పోలీసులు గుర్తించారు.