జగిత్యాల, జనవరి 3 (నమస్తే తెలంగాణ): పొరుగు రాష్ర్టానికి ఉపముఖ్యమంత్రి.. పెద్ద సినిమా యాక్టర్.. అయితే, ఇ దేంది? ఇట్ల చేస్తరా? ఆయన ఏమైనా భగవంతుడి కంటే అధికుడా? ఏకంగా రాజగోపురం ఎదుట పోలీసు గౌరవ వందనం ఏందీ? ఆ హంగామా ఏందీ? రాజగోపురం ముందే మీడియాతో సమావేశం ఏంటి? ఆగమనం అనేది సనాతన సంప్రదాయం.. వాటికి తిలోదకాలు ఇచ్చేలా పాలకులు, ఉన్నతాధికారులే వ్యవహరించడం ఏంటి? అంటూ భక్తులు, పురోహితులు, సనాతన ధర్మం ఆచరించేవాళ్లు ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌కల్యాణ్ కొండగట్టు పర్యటనలో కొన్ని ఘటనలే ఇందుకు కారణమవుతున్నాయి. అంజన్న ఆలయ రాజగోపురం ప్రధాన ద్వారం పక్కనే పోలీసులు గాడ్ ఆఫ్ హానర్ ఇవ్వడాన్ని రుత్వికులు తప్పుబడుతున్నారు. ఎంత పెద్ద వీఐపీలు అయినా రాజగోపురం ఎదుట స్వామివారికే నమస్కరించాలి గానీ, ఇతరులకు వందనం సమర్పించకూడదని చెప్తున్నారు. గౌరవ వందనం సమర్పించిన తర్వాత పోలీసులు, ప్రజాప్రతినిధులు, పవన్‌తో ఫొటోలు దిగుతూ హంగామా చేయడంపై పండితులు తప్పుబడుతున్నారు.
ఇదెక్కడి ఆనవాయితీ.. ఇదెక్కడి ఆత్మీయత
కొండగట్టు అంజన్న ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. శనివారం ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు కొండగట్టుకు వచ్చారు. ఆయనకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ తదితరులు స్వాగతం పలుకడంతోపాటు, పోలీసులతో గౌరవ వందనం ఏర్పాటు చేశారు. గాడ్ ఆఫ్ హానర్ ఏర్పాటు చేసిన స్థలం వివాదాస్పదంగా మారింది. ఆలయ ఆగమాలకు విరుద్ధంగా అంజన్న రాజగోపురం ప్రధాన ద్వారానికి కొద్ది ఎడంగా ఏర్పాటు చేశారు. దాదాపు రాజగోపురం ప్రధాన ద్వారం ఎదురుగా, స్వా మివారి ఆలయ ప్రాంగణంలో బూట్లతో పోలీసులు గాడ్ ఆఫ్ హానర్ ఇవ్వడంపై రుత్వికులు పెదవి విరుస్తున్నారు.