హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): పటిష్ట శాంతిభద్రతలు కల్పించడంతోపాటు నేరాల కట్టడికి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పోలీసులు చక్కటి విజయాలు సాధిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్ర స్థాయి సిబ్బంది టెక్నాలజీ ఉపయోగిస్తూ ప్రజలకు అత్యుత్తమ సేవలందిస్తున్నారు. హైదరాబాద్‌లో అత్యంత కీలకమైన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్(పీఎస్‌ఐవోసీ) ద్వారా ప్రతిక్షణం సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈ కేంద్రంలో అన్ని విభాగాలు ఒకేచోట ఉండి ప్రతి అంశాన్ని వీడియోలో రికార్డు చేస్తూ శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాలను కట్టడి చేయడం, ట్రాఫిక్ నియంత్రణ తదితర వాటిపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ నిర్వహిస్తుంది.
పీఎస్ఐవోసీలో ఏముంటాయి
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 2020 నవంబర్ 11న తెలంగాణ స్మార్ట్ సిటీలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ట్రై పోలీస్ కమిషనరేట్లకు సేవలందించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్, క్రైమ్స్, సోషల్ మీడియా, విపత్తుల నిర్వహణ విభాగాలు ఒకేచోట ఉంటాయి. ఇది మూడు కమిషనరేట్లకు సంబంధించిన డాటా సెంటర్‌గా పనిచేస్తున్నది. ఇక్కడ 15 పెటా బైట్లు (1.5 కోట్ల జీబీ) డాటా స్టోర్ చేసే సామర్థ్యం ఉన్న సర్వర్లు ఉన్నాయి. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటు చేస్తున్న 10 వేల సీసీ కెమెరాలు, కమ్యూనిటీ సీసీ కెమెరాలు దీనికి అనుసంధానమై ఉంటాయి.
నేరుగా ఘటనా స్థలం రికార్డు
షాద్‌నగర్‌లో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఘటన స్థలికి వెళ్లిన పోలీసులు అక్కడి పరిస్థితులను రికార్డు చేస్తున్నారు. అంతలోనే సైబరాబాద్ కమిషనరేట్‌లోని పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్(పీఎస్‌ఐవోసీ) నుంచి ఘటన స్థలిలో ఉన్న సిబ్బందికి ఫోన్ చేసి ఏమి జరిగిందని ప్రశ్నించగా, అక్కడున్న కానిస్టేబుల్ తన సెల్ఫోన్లో ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా ఘటన స్థలిని మొత్తం వీడియోలో పీఎస్ఐవోసీలో ఉన్న సిబ్బందికి చూపించారు. అదంతా రికార్డు అయ్యింది. ఇలా ప్రతి క్రైమ్ సీన్‌ను సైబరాబాద్‌లో వీడియో రికార్డు చేస్తున్నారు. అన్ని పోలీస్ విభాగాలు ఒకటే కేంద్రం నుంచి క్షేత్రస్థాయిలో సిబ్బంది విధులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఎల్అండ్టీ సంస్థ పోలీస్ సిబ్బందితో వీడియోకాల్స్‌లో మాట్లాడేలా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
వచ్చే జనరేషన్ కోసం మెగా పోలీసింగ్
సీఎం కేసీఆర్ సైబరాబాద్ ను మెగా పోలీసింగ్‌గా తీర్చిదిద్దాలనుకొంటున్నారు. ఒకేచోట నుంచి అన్ని అంశాలకు సంబంధించిన పర్యవేక్షణ ఉండాలి. ప్రభుత్వం ఎన్నో వనరులతోపాటు నిధులు ఇచ్చింది. ఇది ఒక ఫ్యూజన్ సెంటర్. నేరాలు, ట్రాఫిక్, మహిళల భద్రత, అర్ముడ్ రిజర్వు, సెక్యూరిటీ తదితర విభాగాల్లో వేర్వేరు డాటా బేస్ ఉంటుంది. వాటన్నింటిని తీసుకొని విశ్లేషించి క్షేత్ర స్థాయిలో ఉండే బీట్, పెట్రోలింగ్ అధికారులకు అవసరమైన డాటాను అందిస్తాం. పట్టణీకరణ పెరగడంతో టెక్నాలజీని ఉయోగిస్తూ వచ్చే జనరేషన్ పోలీసింగ్ ఎలా ఉండాలి..టెక్నాలజీతో ప్రజలకు మరింత వేగంగా సేవలు ఎలా అందించాలన్నది ప్రధానమైంది.
-స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సీపీ