Lagacharla | హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో కలెక్టర్‌పై దాడి నెపంతో నవంబర్ 11 అర్ధరాత్రి పోలీసులు సృష్టించిన అరాచకం నిజమేనని ప్రజాస్వామ్య హకుల పరిరక్షణ సంస్థ ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ డెమొక్రటిక్ రైట్స్ (ఓపీడీఆర్) తెలిపింది. బాధిత గ్రామాల్లో పర్యటించి వాస్తవాలను నిగ్గుతేల్చింది. ఆ రోజు రాత్రి ఆయా గ్రామాల్లోకి పోలీసులు అర్ధరాత్రి ఒంటి గంటకు చొరబడి, కరెంటు ఆఫ్ చేసి ఒక్కో ఇంటికి 15 నుంచి 20 మంది పోలీసులు పంపినట్టు బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నది. పురుషులను విచక్షణ రహితంగా కొట్టి, స్త్రీలు, పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తించి, భయభ్రాంతులకు గురిచేసి భయానక వాతావరణాన్ని సృష్టించారని వివరించింది. కొంతమంది ప్రజలు, రైతులపై అక్రమ కేసులు పెట్టి వారిని జైలుకు పంపగా, మరి కొందరు ఊరి బయట తలదాచుకున్నట్టు తెలిపారు. స్త్రీలు, పిల్లలు వృద్ధులు మాత్రమే గ్రామంలో బికుబికుమంటూ గడుపుతున్నారని, ఏ అర్ధరాత్రి పోలీసులు తమ ఇంటి మీద దాడి చేస్తారని భయంతో ఒకచోటనే అందరూ పడుకుంటూ తమకు తాముగా ధైర్యం చెప్పుకుంటున్న దీన స్థితి సీఎం సొంత నియోజకవర్గంలో ఉందని ఓపీడీఆర్ ఆవేదన వ్యక్తంచేసింది. దాడులను తక్షణమే ఆపాలని రైతులు, ప్రజలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది.
రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి అరాచకం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల, ఆర్బీతండా, పొలిపల్లి, పులిచెర్ల, హకీంపేట గ్రామాల్లో ఫార్మా కంపెనీ పెట్టడం కోసం ఆ గ్రామాల రైతుల దగ్గర్నుంచి సుమారు 13 వందల ఎకరాల భూములను సేకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. సీఎం రేవంత్‌రెడ్డి అన్న ఎనుముల తిరుపతిరెడ్డి, ఇకడి గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల భూములను కంపెనీకి అప్పజెప్పాలనే ఉద్దేశంతో ఆ మండల తహసీల్దార్, అదనపు జిల్లా కలెక్టర్‌తో కలిసి తొమ్మిది నెలలుగా తీవ్ర ఒత్తిడి చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఓపీడీఆర్ తెలిపింది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వారి భూములను లాకునే ప్రయత్నం చేశారని ప్రజా స్వామ్య పరిరక్షణ సంస్థ సభ్యులు పేర్కొన్నారు. భూములు కోల్పోతే వారి జీవనోపాధి పోతుందని, వీటికి తోడు తీవ్రమైన అనారోగ్య సమస్యలు, నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం జరుగుతుంది కాబట్టే రైతులు భూములు ఇవ్వలేదని తెలిపారు. ఈ క్రమంలో వారు ధర్నాలు, రాస్తారోకోలు, కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇస్తూ వచ్చారని, తిరుపతిరెడ్డి ఇంటికి వెళ్లి తమ గోడును విన్నవించుకుంటే బూటు కాళ్లతో తన్ని, పోలీసుల చేత కొట్టించి భూములు ఇవ్వాల్సిందేనని భయపెట్టి పం పించారని బాధితుల తమకు చెప్పినట్టు పేర్కొన్నారు.
రైతులను భయపెట్టిన అధికారులు
ఫార్మా బాధిత గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు తహశీల్దారు, అడిషనల్ కలెక్టర్ వెళ్తే భూములు ఇవ్వబోమని, అక్కడ కంపెనీ పెట్టొద్దని అధికారుల కాళ్లు, చేతులు పట్టుకుని రైతులు బతిమాలారని తెలిపారు. అయితే, అధికారులు ‘చూస్తాం. పరిశీలిస్తాం’ అని చెప్పి.. తర్వాత రోజున రైతులు భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నారని జిల్లా అదనపు కలెక్టర్ పత్రికా ప్రకటన విడుదల చేసినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో తహసీల్దార్ రైతులను భయపెడుతూ ‘ఎకడికి వెళ్లినా ఇకడికే తిరిగి రావాల్సి వస్తుంది. కా బట్టి మీరు భూములు ఇవ్వాల్సిం దే’ అని చెప్పి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని తెలిపారు.
దాడికి దారితీసిన పరిస్థితులు ఇవే
జిల్లా కలెక్టర్ సమక్షంలో అదనపు కలెక్టర్, తహసీల్దార్, అధికారులు, పోలీసు యంత్రాంగాన్ని తీసుకొని గ్రామాల్లో కాకుండా ఊరి బయట మీటింగ్ ఏర్పాటు చేసి, ప్రజలందరిని పిలిచి వారిని ఒప్పించే ప్రయత్నం చేశారని ఓపీడీఆర్ ప్రతినిధులు తెలిపారు. రైతులు ఆ సమావేశానికి వెళ్లకుండా గ్రామంలోనే ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని, అధికారులు తమ ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని, తాము భూములు ఇచ్చే ప్రసక్తే లేదని భీష్మించుకున్నారని వివరించారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే క్రమంలో గతంలో తమ వద్దకు వచ్చిన అదనపు కలెక్టర్, తహసీల్దార్ చేసిన మోసాన్ని ప్రజలు గుర్తు పెట్టుకొని, మళ్లీ వచ్చింది వారేనని, జిల్లా కలెక్టర్ వేరే అని తెలియక కలెక్టర్ ‘గో బ్యాక్’ అని నినాదాలు చేస్తూ వారిని అకడ నుంచి తరిమే ప్రయత్నం చేశారని తెలిపారు. వారందరూ రైతులు కాబట్టి తనపై ఎలాంటి దాడి జరగలేదని కలెక్టర్ చె ప్పారని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం, పో లీస్ యంత్రాంగం అకడి ప్రజలను రెచ్చగొట్టి కలెక్టర్ పైన దాడి చేయించాయని, ఆ తర్వాత మధ్యరా త్రి ఒంటి గంటకు ఆయా గ్రామాల్లో కరెంటు బంద్ చేసి ప్రతి ఇంటిపై 15 నుంచి 20 మంది పోలీసులు దాడి చేసి పురుషులు, మహిళలు, పిల్లలను లాక్కొ చ్చి, యువకులను విచక్షణ రహితంగా కొట్టి, నిర్బంధించి, కేసులు పెట్టారని వివరించారు.
గ్రామాల్లోకి వెళ్లకుండా పోలీసు కంచెలు
ఫార్మా బాధిత గ్రామాల్లోకి ఎవరినీ వెళ్లనీయకుండా చుట్టూ పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేశారని ఓపీడీఆర్ సంస్థ వెల్లడించింది. ఆ గ్రామాల్లోని రైతులు, వృద్ధులు తమ గ్రామాలు విడిచి వెళ్లిపోవాలని కోరితే, వెళ్లే ప్రసక్తే లేదంటూ పోలీసులు వారిని కొట్టి పంపిస్తున్నారని కమిటీ సభ్యులు చెప్పారు. తమను కూడా 12 కిలోమీటర్ల దూరంలోనే ఆపి ‘మీరు వెళ్లడానికి వీల్లేదు’ అని అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. అయినా తాము వెళ్లి బాధితులతో మాట్లాడి, పిల్లలు, వృద్ధులతో చర్చించి ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. కలెక్టర్ సమక్షంలో జరిగిన సంఘటన ఉద్దేశపూర్వకం కాదని, ఈ సంఘటనను ఆధారం చేసుకుని అకడి రైతుల పైన, గిరిజనుల పైన పోలీసులు, ప్రభుత్వం చేస్తున్న దాడులను, దౌర్జన్యాలను తక్షణమే ఆపాలని ఓపీడీఆర్ డిమాండ్ చేసింది. అకడి ప్రజల పైన పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరింది.