ఆదిభట్ల, ఫిబ్రవరి 5: కొంగరకలాన్, ఫిరోజ్‌గూడ రెవెన్యూ పరిధిలో బుధవారం పోలీస్ పహారాలో ఫోర్త్‌సిటీ రోడ్డు సర్వేను అధికారులు చేపట్టారు. భూములు కోల్పోతున్న రైతులకు ఉదయం సర్వేకు వస్తున్నట్టు అధికారులు సమాచారం ఇవ్వగా.. వారు వేచిచూశారు. అధికారులు రాకపోవడంతో ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోయారు. ఆ తర్వాత వచ్చిన అధికారులు ఎవరూ లేని సమయంలో సర్వే చేపట్టారు. సర్వే నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని, తద్వారా రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని తెలిపారు. గతంలో కొంగరకలాన్‌లో గ్రామసభ ఏర్పాటు చేసి రైతులకు భూ సేకరణ గురించి వివరించగా ఇచ్చేది లేదని వారు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఆదిభట్ల ఎస్సై వెంకటేస్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వేయర్, ఆర్ఐ , ఆర్అండ్బీ ఏఈ, వ్యవసాయ శాఖాధికారి , ఎక్సైజ్ సీఐ పాల్గొన్నారు.
అధికారులు కనీసం సమాచారం ఇవ్వడం లేదు. ఎంత భూమి పోతుందో, ఎంత పరిహారం ఇస్తారో చెప్పడం లేదు. ఇప్పటికే కేన్స్, ఫాక్స్‌కాన్ కంపెనీలకు భూమి ఇచ్చా. బతుకులు బాగు చేస్తారని కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే మిగిలిన ఎకరం 20 గుంటల భూమిని కూడా గుంజుకుంటున్నారు.