Medaram | మేడారం మహా జాతరలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భక్తులపై ఏఆర్ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు లాఠీలతో విరుచుకుపడ్డారు. సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద నుంచిగా సీఐ సహా పోలీసులు బలగాలు భక్తులను ఈడ్చుకెళ్లి పిడిగుద్దులు గుప్పించారు. పోలీసుల దాడిలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
మేడారం మహాజాతరలో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. భక్తులపై ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ సహా ఐపీఎస్ అధికారులు, సీఐ దయాకర్ వీరంగం సృష్టిస్తున్నారు. అడుగడుగునా భక్తులపై దాడికి దిగుతున్నారు. పోలీసుల ప్రవర్తనపై భక్తులు తీవ్ర ఆగ్రహావేశానికి గురవుతున్నారు. కోపంతో పోలీసు బలగాలపై భక్తులు చెప్పులు విసిరారు. పోలీసుల ప్రవర్తనకు వ్యతిరేకంగా సమ్మక్క ఆలయం వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. మొత్తంగా పోలీసుల ప్రవర్తనతో మేడారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.

Adluri Laxman Convoy
కాగా, మేడారం జాతర సందర్భంగా సమ్మక్క ఆగమనం అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరుకోవడంతో మొక్కులు సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు. గురువారం ఒక్కరోజే సుమారు 30 లక్షల మంది మేడారం చేరుకున్నట్లు అంచనా. ఇలాంటి సమయంలో జంపన్న వాగు వద్ద కిక్కిరిసిన భక్తుల మధ్య సైరన్ వేసుకుని గంటసేపటికి పైగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కారులోనే ఉన్నారు. అదే సమయంలో కరెంటు పోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. సైరన్ శబ్దానికి, మంత్రి అనుచరుల అత్యుత్సాహానికి భక్తులు మండిపడి దాడి చేశారని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.