హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ) : జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో దర్యాప్తుకు వచ్చిన పోలీసులు బంజారాహిల్స్‌లోని టీన్యూస్ ఆఫీసులో అతిగా ప్రవర్తించారు. దర్యాప్తులో భాగంగా రెండోరోజు బుధవారం చిక్కడపల్లి ఏసీపీ ఎల్ రమేశ్, సీఐ రాజునాయక్ నేతృత్వంలో వచ్చిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరించారని టీన్యూస్ సిబ్బంది ఆరోపించారు. ఓ వైపు అధికారులు టీ న్యూస్ యాంకర్లను, ఉద్యోగులను ప్రశ్నిస్తుండగా.. మరోవైపు ఈ విచారణను వీడియో తీసిన వ్యక్తి వెంటనే ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాలకు అందించినట్టు తెలిపారు. ఓ వైపు విచారణ జరుగుతుండగానే ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తుకు తాము పూర్తిగా సహకరించామని, తాము ఎక్కడా ఎదురు ప్రశ్నలు వేయలేదని చెప్పారు.
ఏసీపీ రమేశ్, సీఐ రాజునాయక్ టీ న్యూస్ సీఈవో శైలేశ్‌రెడ్డి చాంబర్లో మాట్లాడుతుండగానే అప్పటివరకూ తీసిన వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమయ్యాయి. ఆ వీడియోలు తీసిన వ్యక్తికోసం గాలించగా అతడు బయటకు వెళ్లినట్టు తెలిసి టీన్యూస్ సిబ్బంది నిరసన తెలిపారు. టీన్యూస్ సీసీ కెమెరాల్లో చూసినప్పుడు వీడియో తీసిన వ్యక్తి మొదటినుంచి సీఐ రాజునాయక్ వెంట ఉన్నట్టు కనిపించింది. కానీ ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని సీఐ చెప్పారు. దీనిపై స్పందించిన శైలేశ్‌రెడ్డి.. ‘మరి మీతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారా.. లేక మీరు తీసుకువచ్చారా.. ఈ వీడియోలను కాంగ్రెస్ అనుకూల మీడియాకు, సోషల్ మీడియాలో వైరల్ చేయడం వెనక ఉద్దేశమేమిటి?’ అని నిలదీశారు.
ఓ వైపు తాము దర్యాప్తుకు సహకరిస్తుండగానే మహిళా ఉద్యోగుల గోప్యతకు భంగం వాటిల్లేలా వీడియోలు వైరల్ చేయడం ఎంతవరకు సమంజసమని పోలీసులను ప్రశ్నించారు. వీడియోలు తీసిన వ్యక్తిని తాను చూసి వస్తానని సీఐ రాజునాయక్ టీన్యూస్ ఆఫీసు నుంచి బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో ఏసీపీ రమేశ్, శైలేశ్‌రెడ్డి తదితరులు రాజునాయక్ వద్దకు వచ్చి ఆ వ్యక్తి ఎవరని నిలదీశారు. అతనితో తనకు సంబంధం లేదంటూ రాజునాయక్ వెళ్లిపోయారు. ఆ తరువాత వీడియో తీసిన వ్యక్తి టీన్యూస్ వార్తల్లో కనిపించడంతో అతడు తమ కానిస్టేబులేనని వివరణ ఇచ్చారు. ఏసీపీ సమక్షంలోనే ఈ తతంగం కొనసాగడం విస్మయం కలిగించింది. ఏసీపీ ఉన్నప్పటికీ సీఐ చేసిన ఓవరాక్షన్‌పై విమర్శలు వస్తున్నాయి.